దేవర : అది టెక్నికల్‌ ఇష్యూ కాదు!

దేవర సినిమా చూస్తున్న సమయంలో స్క్రీన్‌ సైజ్ మారుతున్నట్లు అనిపించింది.

Update: 2024-09-28 05:18 GMT

ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి చేసిన భారీ ప్రచారం, ముందస్తుగా వచ్చిన బజ్‌ కారణంగా మొదటి రోజు ఏకంగా రూ.140 కోట్ల భారీ ఓపెనింగ్‌ వసూళ్లు నమోదు అయ్యాయి. ఎన్టీఆర్‌ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా దేవర నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను ఫ్యాన్స్ ఫుల్‌ గా ఎంజాయ్ చేశారు. ఎన్టీఆర్‌ నటన తో పాటు, యాక్షన్ సన్నివేశాలకు, అనిరుధ్ సంగీతానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే కొన్ని థియేటర్‌ లలో సినిమా స్క్రీన్‌ సైజ్ విషయంలో గందరగోళం క్రియేట్‌ అయింది. ఆ విషయమై మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... దేవర సినిమా చూస్తున్న సమయంలో స్క్రీన్‌ సైజ్ మారుతున్నట్లు అనిపించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల సమయంలో కాస్త అటు ఇటు అయినట్టు అనిపించింది. ప్రేక్షకులు థియేటర్‌ లో సాంకేతిక లోపం అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే సినిమా మేకింగ్‌ సమయంలోనే సినిమాటోగ్రాఫర్ ప్రయోగాత్మకంగా యాక్షన్‌ సన్నివేశాలను అద్భుతమైన విజువల్స్ గా మార్చేందుకు ముఖ్యంగా ఐమాక్స్ వర్షన్‌ కి, బిగ్‌ స్క్రీన్స్‌ కోసం స్క్రీన్‌ రేషియో ను మార్చారు. ఐమాక్స్ ఫ్రేమ్స్‌ ను ఎంపిక చేసి షూటింగ్ చేశారట. అందుకే స్క్రీన్‌ సైజ్ లో మార్పులు కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

యాక్షన్‌ సన్నివేశాలతో పాటు కొన్ని కీలక సన్నివేశాల ఫీల్‌ ను ఆస్వాదించడం కోసం ఈ విధంగా ప్లాన్‌ చేశారు. కానీ ఆ విషయాన్ని ముందస్తుగానే చెప్పక పోవడంతో కొందరు టెక్నికల్‌ ఇష్యూ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కొందరు ఈ విషయాన్ని లేవనెత్తినప్పుడు అసలు విషయాన్ని కొందరు క్లారిటీ ఇస్తున్నారు. ఈ సినిమా తో సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు ప్రయోగాన్ని చేశారు. ఈ ప్రయోగం సఫలం అయితే ముందు ముందు మరిన్ని సినిమాలకు ఇలాంటి పద్ధతిని పాటించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

ఎన్టీఆర్‌ ద్వి పాత్రాభినయం చేసిన దేవర సినిమాలో జాన్వీ కపూర్‌ పోషించిన పాత్ర చాలా అందంగా కనిపించడంలోనూ రత్నవేలు ప్రయోగాత్మక షాట్స్ ఉపయోగపడ్డాయి. అందమైన జాన్వీ కపూర్‌ ను మరింత అందంగా చూపించారు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ఊహలను అందుకున్న రత్నవేలు అద్భుతమైన కెమెరా మూవ్స్ తో ప్రేక్షకుల్లో ఒక విధమైన అనుభూతి కలిగేలా చేశారు. ప్రస్తుతం సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్ల దిశగా దూసుకు పోతుంది. కనుక లాంగ్ రన్‌ లో సినిమా రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News