మ‌ళ్లీ సారీ చెప్పిన ధ‌న్య‌.. ఇదేమైనా ప‌బ్లిసిటీ స్టంటా?

అయితే సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు, ధన్య బాలకృష్ణ పాత వివాదం ఇక‌టి సోషల్ మీడియాలో మళ్లీ వైర‌ల్ అవుతోంది. ఇది నెటిజ‌నుల్లో డిబేట్ గా మారింది.

Update: 2024-02-02 16:15 GMT

నటి ధన్య బాలకృష్ణ 'లాల్ సలామ్' సినిమాతో మ‌రోసారి అభిమానుల్ని ప‌ల‌క‌రించ‌నుంది. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న థియేటర్లలోకి రానుంది. అయితే సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు, ధన్య బాలకృష్ణ పాత వివాదం ఇక‌టి సోషల్ మీడియాలో మళ్లీ వైర‌ల్ అవుతోంది. ఇది నెటిజ‌నుల్లో డిబేట్ గా మారింది.


ధన్య బాలకృష్ణ పాత కామెంట్లు ఇప్పుడు కొత్త‌గా చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. తమిళ ప్రజల గురించి అప్ప‌ట్లో ధ‌న్య తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. ఇప్పుడు త‌న‌ సినిమా విడుదలకు ముందు ధన్య పాత వ్యాఖ్యలను ఖండిస్తూ త‌ప్పున‌కు చింతిస్తున్నట్లు తెలిపింది. రజనీకాంత్, ఐశ్వర్య అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.


ఇంత‌కీ వివాదం ఏమిటీ? అంటే... 2012లో చెన్నై సూపర్ కింగ్స్ IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్)కి అర్హత సాధించిన తరువా ధన్య ఫేస్‌బుక్ పోస్ట్‌లో తమిళ ప్రజల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ పోస్ట్‌లో, చెన్నైకి చెందిన ప్రజలు నీరు విద్యుత్ కోసం బెంగళూరుపై ఆధారపడుతున్నారని ఆరోపించింది. పర్యటనల సమయంలో వారు నగరంలో చెత్తను వేస్తున్నారని విమర్శించారు.

ఇప్పుడు లాల్ సలామ్ విడుదలకు ముందు ఈ వ్యాఖ్య మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంత‌కుముందు సారీ చెప్పిన ధ‌న్య ఇప్పుడు మాట మార్చింది. ఈ పోస్ట్ కల్పితమని పేర్కొంది. ధ‌న్య‌ ప్రకటన ధృవీకరిస్తూ, ''నా టేబుల్‌పై భోజనం పెట్టే నా వృత్తిపై నేను ప్రమాణం చేస్తున్నాను.. ఇప్పుడు చలామణిలో ఉన్న ప్రకటన నేను చేసినది కాదు.. అది నా అభిప్రాయం కాదు. ఇది జరిగిన 12 సంవత్సరాల క్రితమే నేను స్పష్టం చేశాను.. ఈ రోజు కూడా చెబుతున్నాను. ఇది ఒక ట్రోల‌ర్ సృష్టించిన స్క్రీన్ షాట్. కానీ అది నేను కాదని మీకు నిరూపించడానికి నా ద‌గ్గ‌ర ఆధారాలేవీ లేవు'' అని అన్నారు. తాను, త‌న కుటుబం చాలా బెదిరింపులు, ద్వేషాన్ని ఎదుర్కొన్నామ‌ని, వారిని ర‌క్షించేందుకు అప్ప‌ట్లో ప్ర‌య‌త్నించాన‌ని, అందువ‌ల్ల‌నే త‌ప్పు చేయ‌క‌పోయినా సారీ చెప్పాన‌ని పేర్కొంది. రజనీకాంత్, ఐశ్వర్య రజనీకాంత్ అభిమానులకు ఏదైనా అసౌకర్యం, బాధ కలిగించినందుకు క్షమాపణలు చెప్పాన‌ని అంది. అయితే పాత వివాధాన్ని కొత్త‌గా తెర‌పైకి తెచ్చి క్ష‌మాప‌ణ‌లు కోర‌డ‌మేంటి? ఇదేమైనా ప‌బ్లిసిటీ స్టంటా? అంటూ అభిమానుల్లో ఒక సెక్ష‌న్ విశ్లేషిస్తోంది.

లాల్ సలామ్ ఒక స్పోర్ట్స్ డ్రామా.. ఇందులో విష్ణు, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. రజనీకాంత్ అతిధి పాత్రలో ఎక్కువసేపు కనిపిస్తారు. ఇటీవలే చెన్నైలో జరిగిన ఈ సినిమా ఆడియో వేడుకకు ధన్య బాలకృష్ణ కూడా హాజరయ్యారు. ఈవెంట్ సందర్భంగా ఐశ్వర్య సినిమా సెన్సిటివ్ అంశాల‌తో తెర‌కెక్కింద‌ని తెలిపింది. తన తండ్రి వంటి లోతైన మానవత్వం ఉన్న వ్యక్తి మాత్రమే అలాంటి ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి అంగీకరిస్తారని తెలిపింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న థియేటర్లలోకి రానుంది.


Tags:    

Similar News