రాజుగారు అనీల్ లాంటి వాళ్ల‌ను త‌యారు చేస్తున్నాడా?

సినిమా వైఫ‌ల్యం రాజుగారికి చాలా పాఠాలు నేర్పింద‌ని ఆయ‌నే అన్నారు.

Update: 2025-02-15 23:30 GMT

ప్ర‌యోగాలు చేస్తే ఎలా ఉంటుంది? అన్న‌ది ఇటీవ‌ల 'గేమ్ ఛేంజ‌ర్' ద్వారా దిల్ రాజుకు అర్ద‌మైంది. శంక‌ర్ తో సినిమా చేయ‌డం అన్న‌ది దిల్ రాజు క‌ల‌. ఆ క‌ల‌ను 'గేమ్ ఛేంజ‌ర్' రూపంలో తీర్చుకున్నారు. సినిమా వైఫ‌ల్యం రాజుగారికి చాలా పాఠాలు నేర్పింద‌ని ఆయ‌నే అన్నారు. కంప‌ర్ట్ జోన్ వ‌దిలేసి సినిమాలు చేస్తే ప‌రిస్థితి అలా ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. వాస్త‌వానికి ఇండియన్ 2 చిత్రాన్ని రాజుగారే నిర్మించాలి.

కానీ ఆ ఛాన్స్ మిస్ అవ్వ‌డంతో? గేమ్ ఛేంజ‌ర్ విష‌యంలో త‌గ్గేదేలే అని బ‌రిలోకి దిగి చేతులు కాల్చుకున్నారు. గేమ్ ఛేంజ‌ర్ లో వ‌చ్చిన న‌ష్టాల‌ను సంక్రాంతికి వ‌స్తున్నాం లాభాల‌తో బ్యాలెన్స్ చేయ‌డంతో? రాజుగా పెద్ద స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ్డారు. ఇక‌పై మాత్రం త‌న మార్క్ సినిమాలతోనే అల‌రిస్తాన‌ని ప్రామిస్ చేసారు. త‌న జ‌డ్జిమెంట్ త‌ప్పే సినిమాలేవి తీయ‌నని ప్ర‌క‌టించారు.

మ‌రి రాజుగారు ఇప్పుడు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు? అంటే అనీల్ రావిపూడి లాంటి రైట‌ర్ల‌ను వెతికి ప‌ట్టుకునే ప‌నిలో ఉన్న‌ట్లు స‌మాచారం. అనీల్ రావిపూడి ఆ సంస్థకు ఆరు విజ‌యాలు అందించాడు. అన్నీ క‌మ‌ర్శియ‌ల్ గా మంచి లాభాలు తెచ్చి పెట్టిన చిత్రాలే. రూపాయి పెడితే రెండు రూపాలు లాభం వ‌చ్చిన చిత్రాలే అనీల్ ఆ సంస్థ‌లో చేసాడు. దీంతో అనీల్ కి దిల్ రాజు బ్యాన‌ర్ అన్న‌ది సొంత నిర్మాణ సంస్థ‌లా మారి పోయింది.

తాజాగా రాజుగారి ఐడియాకి అనీల్ కూడా తోడ‌య్యాడుట‌. త‌న వద్ద ప‌నిచేసిన కొంత మంది రైట‌ర్ల‌ను అనీల్ త‌ర‌హాలో క‌థ‌లు రాసేలా సాన బెడుతున్నాడుట‌. ఆ రైట‌ర్ల బృందానికి అవ‌స‌ర‌మైన‌వి అన్నీ ఏర్పాటు చేస్తూ మంచి రైట‌ర్ల‌గా తీర్చిదిద్దితున్నారుట‌. ప్ర‌స్తుతం టాలీవుడ్ ట్రెండ్ మారినా? క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల విలువేంటో రాజుగారికి బాగా తెలుసు.

అలాంటి క‌మ‌ర్శియ‌ల్ క‌థే రాజుగారిని స‌మ‌స్య నుంచి బ‌ట‌య ప‌డేయ‌టంతో ఆ త‌ర‌హా క‌థ‌లు త‌మ సంస్థ నుంచి మ‌రిన్ని రూపొందేలా? ఇలా కొత్త ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. దీనిలో భాగంగా కొంత మంది జ‌బ‌ర్ద‌స్త్ కు పనిచేసిన రైట‌ర్లు కూడా యాడ్ అవుతున్న‌ట్లు స‌మాచారం. భ‌విష్య‌త్ లో వీళ్లంతా అదే సంస్థ‌లో వివిధ విభాగాల్లో ప‌ని చేసేలా ఒప్పందం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలి.

Tags:    

Similar News