మ్యాడ్ స్క్వేర్... ఒకటి తగ్గింది మామ
నితిన్ నార్నే, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించి 'మ్యాడ్' మూవీ 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది;
నితిన్ నార్నే, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించి 'మ్యాడ్' మూవీ 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ వారంలో ఆ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన 'మ్యాడ్ స్క్వేర్' విడుదల కాబోతుంది. మార్చి 28న విడుదల కాబోతున్న 'మ్యాడ్ స్క్వేర్' ప్రమోషన్స్‌ను భారీగా చేస్తున్నారు. ముగ్గురు హీరోల చిట్ చాట్ వీడియోలతో పాటు, ఫన్నీ విడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా హిట్ సినిమా సీక్వెల్ అనే బ్రాండ్ ఇమేజ్‌తో పబ్లిసిటీ బాగానే దక్కింది. కానీ పాటల విషయంలో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మ్యాడ్ సినిమా మ్యూజికల్‌గా హిట్ అందుకున్న విషయం తెల్సిందే. కానీ మ్యాడ్ స్క్వేర్ మ్యూజికల్‌గా ఇప్పటి వరకు వార్తల్లో నిలవలేదు అనేది కొందరి అభిప్రాయం.
సినిమా విషయంలో ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గా ఉన్నప్పటికీ పాటల విషయంలో ఒకింత అసంతృప్తి ఉంది. మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్ జోరు బాగానే ఉంది, విడుదలకు ముందు ఈ మాత్రం హడావుడి ఉంటే కచ్చితంగా ఓపెనింగ్ వసూళ్లు బాగానే ఉంటాయి. అయితే మ్యూజిక్ విషయంలోనూ శ్రద్ధ అవసరం అనే విషయాన్ని మేకర్స్ గుర్తించాలనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు పాటలు, బీజీఎం పరంగా మ్యాడ్ స్క్వేర్ వార్తల్లో నిలవలేదు. మ్యాడ్‌లోని రెండు మూడు పాటలు విడుదలకు ముందే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కానీ ఈ సినిమాలోని పాటలు ఇప్పటి వరకు జనాలకు నోటెడ్ కాలేదు. సినిమా విడుదల అయిన తర్వాత ఏమైనా ప్రభావం చూపిస్తాయా అనేది చూడాలి.
మ్యాడ్ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించాడు. ఈ సీక్వెల్‌కి సైతం ఆయనే సంగీతాన్ని అందించాడు. భీమ్స్ ప్రస్తుతం ఉన్న ఫామ్ నేపథ్యంలో మ్యాడ్ స్క్వేర్ నుంచి రెండు మూడు మాస్ బీట్ సాంగ్స్‌ను ప్రేక్షకులు ఆశించారు. కానీ ఒక్కటి కూడా ఆకట్టుకోలేక పోయింది. సినిమా విడుదల తర్వాత అయినా భీమ్స్ తన మ్యూజిక్‌తో ఆకట్టుకుంటాడా అనేది చూడాలి. ప్రస్తుతం భీమ్స్ ఉన్న బిజీ నేపథ్యంలో మ్యాడ్ స్క్వేర్‌కి న్యాయం చేయలేక పోయాడా అనే టాక్ సైతం వినిపిస్తుంది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఇంకాస్త ఎక్కువ దృష్టి సంగీతం పెట్టి ఉంటే ఇప్పటికే ఉన్న బజ్‌కి రెట్టింపు బజ్ క్రియేట్ అయ్యి ఉండేది. ప్రమోషన్స్‌తో క్రియేట్ చేసిన బజ్ కారణంగా మినిమం ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
కొన్ని పాటలు సినిమా విడుదలకు ముందు కంటే విడుదల తర్వాత హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కనుక భీమ్స్ ఇచ్చిన పాటలు మ్యాడ్ స్క్వేర్ సినిమా విడుదల అయిన తర్వాత ఏమైనా హిట్ అవుతాయో చూడాలి. భీమ్స్ ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని పాటలతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు అనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయినా స్పెషల్‌గా ఇచ్చి ఉంటాడా అనేది చూడాలి. మ్యాడ్ స్క్వేర్‌కి ఉన్న బజ్ నేపథ్యంలో పాటలు రెండు మాస్ ఆడియన్స్‌కి కిక్ ఇచ్చే విధంగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటే కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.