వెంకటేష్ సెట్ లో నిర్మాతగా వ్యవహరిస్తారా?
విక్టరీ వెంకటేష్ స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.
విక్టరీ వెంకటేష్ స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన టచ్ చేయని జోనర్ అంటూ లేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటులు. అనుకోకుండా నటుడైనా వెంకటేష్ అటుపై అంచలంచెలుగా ఎదిగి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు. మూవీ మోఘల్ రామానాయుడు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నటుడు.
అయితే తండ్రి ప్రయాణానికి భిన్నంగా తనయుడు జర్నీ సాగుతుంది. మరి తండ్రిలో తనయుడు నిర్మాతగా ఆలోచిస్తారా? సినిమా నిర్మాణంపై వెంకటేష్ సైతం అనుభవం సంపాదించారా? అంటే అవుననే అంటున్నారు యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి. ఇద్దరు కలిసి `ఎఫ్ -2` చిత్రానికి పనిచేసిన సంగతి తెలిసిందే. అటుపై ఎఫ్-3 కూడా తెరకెక్కించారు. ఆ రెండు సినిమాలో మంచి విజయం సాధించాయి.
ఈ నేపథ్యంలో వెంకటేష్-అనీల్ మధ్య మంచి స్నేహం కూడా బిల్డ్ అయినట్లు తెలుస్తుంది.` ప్రొడ్యూసర్ గారి అబ్బాయి వల్ల కావొచ్చు. వెంకీ హీరోలా కాకుండా నిర్మాతగా ఉంటారు. అలాగే ఆలోచిస్తారు సెట్ లో. చుట్టూ ఉన్న వారికి ప్రేమని పంచుతారు. ఆయనతో చేసిన ఎఫ్ -2 సినిమా నాకు నాల్గవ చిత్రం. ఈరోజు సీన్ ఏంటి అని ఎప్పుడూ అడిగే వారు కాదు. డైలాగులు ఏంటి అని మాత్రమే అడిగేవారు. హార్ట్ ఫుల్ గా ఉంటారు.
సెట్ కి రాగానే అనీల్ అనీల్ అని దీర్ఘం తీసి మరీ పిలిచేవారు. ఆ పిలుపు నాకెంతో కిక్ ఇచ్చింది. నిర్మాతగా ఆయన చాలా తెలివిగానూ ఆలోచిస్తారు. అనవసరపు ఖర్చుని ఎంకరేజ్ చేయరు. వీలైనంత వరకూ తక్కువలోనే ఆ సీన్ చేద్దాం అంటారు. నిర్మాత గా ఆయనపేరు ఎక్కడా కనిపించకపోయినా ఆయన ఆలోచనలు మాత్రం నిర్మాతలానే ఉంటాయి` అని అన్నారు. రామానాయుడు వారసత్వంతో ఆయన పెద్ద కుమారుడు సురేష్ బాబు నిర్మాతగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే సురేష్ బాబు తనయుడు రానా కూడా హీరోగా నటిస్తూనే సినిమాలు నిర్మిస్తున్నారు. ఆ రకంగా మనవడిగా రానా తాత బాధ్యతలు కొంత వరకూ తీసుకున్నారు అని చెప్పొచ్చు.