దీపావళి ధమాకా: నాలుగింటిలో ఏయే సినిమాలకు బజ్ ఉందంటే?

టాలీవుడ్ లో రేపటి నుంచి దీపావళి సినిమాల సందడి మొదలు కాబోతోంది. ఈసారి ఫెస్టివల్ కు నాలుగు చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి.

Update: 2024-10-29 07:16 GMT

టాలీవుడ్ లో రేపటి నుంచి దీపావళి సినిమాల సందడి మొదలు కాబోతోంది. ఈసారి ఫెస్టివల్ కు నాలుగు చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. 'లక్కీ భాస్కర్', 'క' వంటి రెండు తెలుగు సినిమాలు.. 'అమరన్', 'బఘీర' వంటి రెండు డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. అమావాస్య కారణంగా వాటిల్లో రెండు చిత్రాలు ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. నాలుగింటిలో ఏయే సినిమాలకు తెలుగులో ఎంత మేరకు బజ్ ఉందో ఇప్పుడు చూద్దాం.

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన స్ట్రెయిట్ తెలుగు సినిమా "లక్కీ భాస్కర్". డైరెక్టర్ వెంకీ అట్లూరి తీసిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్ నుంచి వస్తోన్న సినిమా ఇది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. 90స్ ముంబై బ్యాక్ డ్రాప్ లో డబ్బు చుట్టూ అల్లుకున్న ఎమోషన్స్ తో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

నెలకు 6 వేల జీతం తీసుకునే సాధారణ బ్యాంక్ క్యాషియర్.. కోటీశ్వరుడుగా ఎలా మారాడు? ఎలాంటి మార్చాలను ఎంచుకున్నాడు? డబ్బు వచ్చిన తర్వాత అతను వ్యక్తిగత జీవితం ఎలా మారింది? వంటి అంశాలతో 'లక్కీ భాస్కర్' సినిమా రూపొందింది. 'సీతారామం' హీరో, 'సార్' డైరెక్టర్ కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో జనాల్లో ఆసక్తి ఉంది. ఇది కచ్ఛితంగా ఎ సెంటర్లు, మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పిస్తుందనిపిస్తోంది. డబ్బు అనేది అందరికీ కనెక్ట్ అయ్యే కామన్ పాయింట్ కాబట్టి, అన్ని వర్గాల వారిని అలరిస్తుందని చిత్ర బృందం చెబుతోంది.

కిరణ్ అబ్బవరం హీరోగా నటించి చిత్రం "క". విచిత్రమైన టైటిల్ తో అందరూ మాట్లాడుకునేలా చేసిన ఈ సినిమా.. 'జాతర' సాంగ్, ట్రెయిలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. పక్కనోళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న ఓ యువకుడు.. పోస్ట్ మ్యాన్ జాబ్ వచ్చాక కృష్ణగిరి అనే ఊరికి వెళ్లిన తర్వాత ఎలాంటి ఊహించని పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ పీరియడ్ సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కింది.

ఇటీవల కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్లు, మిస్టిక్ థ్రిల్లర్లు చూడటానికి జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సినిమాల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 'క' కూడా అలాంటి జోనర్ లో రూపొందించిన సినిమా కావడం కలిసొచ్చే అంశం. అందులోనూ ఇది బి, సి సెంటర్స్ ను దృష్టిలో పెట్టుకొని రాసుకున్న కథ అని కొత్త దర్శకత్వ ద్వయం చెబుతున్నారు. కాబట్టి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు, ఇలాంటి సినిమాలకు బాక్సాఫీస్ వద్ద తిరుగుండదు.

శివ కార్తికేయన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా "అమరన్". సీనియర్ హీరో కమల్ హాసన్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాన్ని, అదే పేరుతో హీరో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితం ఆధారంగా ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ తెరకెక్కింది. ఆల్రెడీ రిలీజైన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

వాస్తవ సంఘటనలు, నిత జీవిత పాత్రల ఆధారంగా తీసే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తుంది. దేశ భక్తిని చాటే చిత్రాలపై ఎక్కువ మక్కువ చూపిస్తారు. క్లాస్ మాస్ అని తేడా లేకుండా అందరూ చూస్తారు. ఇప్పటికే 'అమరన్' మూవీపై ఆసక్తి నెలకొంది. తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ సాయి పల్లవి.. శివ కార్తికేయన్ ను ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఉండటం ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ అవుతుంది.

దీపావళికి వస్తున్న కన్నడ డబ్బింగ్ మూవీ "బఘీర''. శ్రీమురళీ, రుక్మిణి వసంత్ హీరో హీరోయిన్లుగా నటించారు. KGF, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ రాసిన స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది. ప్రజలను కాపాడటానికి మాస్క్ మ్యాన్ గా మారిన ఓ వ్యక్తి కథను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. మిగతా చిత్రాలతో పోల్చుకుంటే బఘీరా అన్నిట్లోనూ కాస్త వెనుబడి ఉంది. ట్రైలర్ రొటీన్ గా ఉందనే కామెంట్లు వచ్చాయి. తెలుగులో చిత్ర బృందం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కానీ, పెద్దగా బజ్ క్రియేట్ అవ్వడం లేదు. అంచనాలు లేకుండా ఈ సినిమా చూడమని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News