‘లక్కీ భాస్కర్‌’ ట్రైలర్: డ్రగ్స్ ఇచ్చే కిక్ కన్నా, డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ!

'లక్కీ భాస్కర్‌' నుంచి ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ కు ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది.

Update: 2024-10-22 02:53 GMT

'మహానటి' మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌.. 'సీతారామం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఈ క్రమంలో 'కల్కి 2898 ఏడీ' మూవీలో క్యామియోతో సర్ప్రైజ్ చేసాడు. ఇప్పుడు 'లక్కీ భాస్కర్‌' చిత్రంతో అలరించడానికి రెడీ అయ్యారు. 'సార్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.

'లక్కీ భాస్కర్‌' నుంచి ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ కు ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. టీజర్, సాంగ్స్ సినిమాకు మంచి బజ్ తెచ్చిపెట్టాయి. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్, ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.. సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.

''నా పేరు భాస్కర్ కుమార్.. నా జీతం 6 వేల రూపాయలు.. దరిద్రంలో బ్రతుకుతున్నాను.. నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి.. నా బలం, నా భార్య'' అంటూ దుల్కర్ సల్మాన్ తన గురించి చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. తమ బిడ్డతో కలిసి జీవిస్తూ.. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే కష్టాలన్నీ తీరిపోతాయి అని ఎదురు చూసే మధ్యతరగతి భార్యా భర్తలుగా దుల్కర్, మీనాక్షి జంట కనిపించారు. అయితే డబ్బు లేని కారణంగా వారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు ట్రైలర్ లో చూపించారు.

ఫ్యామిలీ కోసం ఏమైనా చేయాలి, ఎంత రిస్క్ అయినా చేసి ఎలాగైనా డబ్బు సంపాదించాలని డిసైడైన భాస్కర్.. తన తెలివితో వేరే ఇతర మార్గాల్లో డబ్బున్న వాడిగా ఎదిగినట్లు తెలుస్తోంది. అయితే డబ్బు వచ్చిన తర్వాత భార్యా భర్తల మధ్య మనస్పర్థలు మొదలైనట్లు కనిపిస్తోంది. ''ఐ యామ్ నాట్ ఏ చీటర్.. ఐ యామ్ జ‌స్ట్ రిచ్'' అంటూ భాస్కర్ తన భార్యతో గొడవ పడటాన్ని మనం చూడొచ్చు. ఓవరాల్ గా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ జీవిత ప్రయాణాన్ని ఈ ట్రైలర్ ఆవిష్కరించింది.

'లక్కీ భాస్కర్' ట్రైలర్ అంతా డబ్బు చుట్టూనే తిరిగింది. ''జూదంలో ఎంత బాగా ఆడావ్ అనేది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపేశావ్ అన్నదే ముఖ్యం'', ''సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్ కన్నా.. డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ'', ''ఇది ఇండియా.. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే అ డబ్బు మన ఒంటి మీద కనపడాలి'' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 90వ దశకంలో స్టాక్ మార్కెట్ లో జ‌రిగిన స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. సినిమా బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా విజువల్స్ ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. 'సార్' సినిమాతో ఆకట్టుకున్న వెంకీ అట్లూరి.. 'లక్కీ భాస్కర్' చిత్రంలో మధ్యతరగతి జీవితాల్లో డబ్బు ప్రభావాన్ని చూపించబోతున్నట్లు అర్థమవుతోంది.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ చేసారు. బంగ్లాన్ ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని అక్టోబర్ 31న తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

Full View
Tags:    

Similar News