డాకు మహారాజ్.. యూఎస్ లో ఎక్కడ తేడా కొట్టిందంటే..?
'డాకు మహారాజ్' సినిమాని శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓవర్ సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసింది. నార్త్ అమెరికాలో ఈ మూవీ పనితీరుకి పంపిణీదారులే కారణమనే ప్రచారాన్ని శ్లోకా డిస్ట్రిబ్యూటర్స్ ఖండించారు.
నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నారు. వరల్డ్ వైడ్ గా 8 రోజుల్లోనే 156 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక యూఎస్ఎలో ఈ సినిమా $1.4+ మిలియన్లు వసూలు చేసింది. సోమవారం నాటికి $1.5M మైలురాయిని దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ చిత్రం ఈపాటికే $2M క్లబ్‌లో చేరగల సామర్థ్యం ఉన్నప్పటికీ, డిస్ట్రిబ్యూటర్ల పూర్ ప్లానింగ్ కారణంగా అలా జరగలేదని బాలయ్య ఫ్యాన్స్ కొందరు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ స్పందించారు.
'డాకు మహారాజ్' సినిమాని శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓవర్ సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసింది. నార్త్ అమెరికాలో ఈ మూవీ పనితీరుకి పంపిణీదారులే కారణమనే ప్రచారాన్ని శ్లోకా డిస్ట్రిబ్యూటర్స్ ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. "ప్రీమియర్‌లకు కేవలం ఒక రోజు ముందు శుక్రవారం మధ్యాహ్నం కంటెంట్ మాకు అందించబడింది. అయినప్పటికీ, మేము శనివారం డెలివరీని నిర్ధారించడానికి UPS సేవలకు ప్రీమియం చెల్లించాము. దురదృష్టవశాత్తూ లాస్ ఏంజిల్స్‌లోని అడవుల్లో మంటలు చెలరేగడం వల్ల ఫ్లైట్ షెడ్యూల్స్ కు అంతరాయం కలిగించాయి. దీని వలన 100 థియేటర్‌లకు డ్రైవ్ డెలివరీలు ఆలస్యం అయ్యాయి."
"మిడ్‌వెస్ట్, ఈస్ట్ కోస్ట్‌లో మంచు తుఫానులు డెలివరీలను మరింత ప్రభావితం చేశాయి, మూడు రోజుల తర్వాత కూడా 75+ థియేటర్లలో డ్రైవ్‌లు ఆలస్యం అయ్యాయి. ఇన్ని ఛాలెంజ్‌లు ఉన్నప్పటికీ, ప్రీమియర్‌ల కోసం వీలైనన్ని ఎక్కువ షోలు వేసి బాలకృష్ణ గారి గత రికార్డులను బద్దలు కొట్టాము. సోమవారం రాత్రికి AMC డ్రైవ్‌లను అందుబాటులోకి వచ్చాయి కానీ, మరొక సినిమా విడుదలవ్వడం వల్ల స్క్రీన్ల సంఖ్యను ప్రభావితం చేసింది. అయినా సరే రెండో వారంలో కూడా 150+పైగా థియేటర్లను నిలబెట్టుకోగలిగాం."
"అన్ని అసమానతలకు వ్యతిరేకంగా 'డాకూ మహారాజ్' సినిమా నందమూరి బాలకృష్ణ మునుపటి చిత్రాలతో పోలిస్తే కలెక్షన్లలో 50% వృద్ధిని సాధించింది. ఉత్తర అమెరికాలో ఆయన కెరీర్‌లో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. నిరాధారమైన ఆరోపణలను ప్రచురించే ముందు వాస్తవాలను ధృవీకరించాలని మేము వాటాదారులందరినీ కోరుతున్నాము. సవాళ్లు అనివార్యమైనప్పటికీ ఫలితాలు తమకు తాముగా మాట్లాడతాయి. డాకూ మహారాజ్ నార్త్ అమెరికాలో భారీ విజయం సాధించింది. వేట ఇంకా అయిపోలేదు" అని శ్లోకా టీమ్ తమ పోస్టులో పేర్కొన్నారు.
ఇకపోతే 'డాకు మహారాజ్' తో పాటుగా సంక్రాంతికి వచ్చిన 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలను కూడా శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థనే ఓవర్ సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. 'సంక్రాంతికి వస్తున్నాం' ఇప్పటికే ఉత్తర అమెరికాలో $2.1 మిలియన్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. టికెట్ రేట్లు $10 - $12 గా నిర్ణయించడం యూఎస్ఏలో కలిసొచ్చింది. ఇటీవల కాలంలో థియేటర్‌లకు వెళ్లడం మానేసిన ఫ్యామిలీ ఆడియన్స్, ఇప్పుడు రేట్లు తక్కువగా ఉండటం వల్ల ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేయకుండా థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తున్నారని తెలుస్తోంది.