చిరంజీవిగారిని బాధపెట్టినందుకు..!
ఆ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవిపైనా కామెంట్లు చేయడంతో అది మెగా ఫ్యాన్స్ లో కల్లోలంగా మారింది.
ప్రతిసారీ మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలలో ప్రత్యర్థులపై దూషణల ఫర్వం గురించి తెలిసిందే. గెలుపు కోసం ఇరు వర్గాల మధ్య రచ్చ సాగుతుంది. అయితే గత ఏడాది `మా` ఎన్నికల్లో ఇలాంటి రచ్చ శ్రుతి మించింది. ఆ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవిపైనా కామెంట్లు చేయడంతో అది మెగా ఫ్యాన్స్ లో కల్లోలంగా మారింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కి మెగా స్టార్ చిరంజీవి అండ్ ఫ్యామిలీ హీరోలు అండగా నిలవగా, మంచు విష్ణు కుటుంబానికి నటుడు వీకే నరేష్ అండగా నిలిచారు. దీంతో మెగా ఫ్యామిలీ వర్సెస్ వీకే నరేష్ అంటూ ప్రచారం సాగింది. మెగా కుటుంబానికి చెందిన సాయిధరమ్ తేజ్ కి నరేష్ కుమారుడు నవీన్ కృష్ణ ఎంతో సన్నిహితుడు కావడంతో ఎన్నికల వల్ల ఏం జరిగిందోనంటూ గుసగుసలు వినిపించాయి.
తాజా ఇంటర్వ్యూలో వీకే నరేష్ మాట్లాడుతూ .. ఎన్నికల వేళ ఒకరిపై ఒకరు ఘర్షణ పడటం సహజమని అన్నారు. అలాంటిది మెగా ఫ్యామిలీ అండగా ఉన్న ప్రత్యర్థిపైనా పోటీకి దిగాం. అయితే ఎలక్షన్స్.. ఎలక్షన్స్ వరుకే.. ఆ తరువాత చిరంజీవిగారితో కలిసి మాట్లాడుకున్నాం. నవీన్ - సాయి ధరమ్ కూడా ఇప్పటికీ అదే స్నేహంతో ఉన్నార``ని నరేష్ చెప్పుకొచ్చారు. మిస్ కమ్యూనికేషన్ వల్ల మాత్రమే ఇది పెద్ద గొడవగా ప్రొజెక్ట్ అయింది. ప్రతిచోటా కుటుంబాల నడుమ, స్నేహితుల మధ్య కూడా గొడవలు జరుగుతుంటాయి. ఆ తర్వాత మళ్లీ కలిసిపోతుంటారు. అయితే ఎలక్షన్స్ అలా గందరగోళంగా జరగడం బాధించింది. దానికి చిరంజీవి గారు, మెగా ఫ్యామిలీ ఎంత బాధ పడ్డారో తెలియదు కానీ నేను మాత్రం చిరంజీవి గారిని బాధ పెట్టినందుకు చాలా ఫీల్ అయ్యాను`` అని అన్నారు.
నరేష్ ఇంకా మాట్లాడుతూ ..``నటుడిగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 50 ఏళ్ల సినిమా ప్రయాణం పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇదంతా ప్రేక్షకుల ప్రేమ, అభిమానం వల్లే సాధ్యమైంది. నా జీవితాంతం చిత్ర పరిశ్రమకు సేవ చేస్తాను`` అని కూడా అన్నారు. ఆయన మాట్లాడుతూ ``9వ సంవత్సరంలో `పండటి కాపురం` వంటి అద్భుతమైన సినిమాతో తెరంగేట్రం చేశాను. మంచి నటుడిని కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. ప్రతి సినిమాలోనూ కొత్తదనాన్ని ప్రయత్నించాను. ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశాను. కానీ రాజీపడి సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదు. మంచి విజయం సాధించినా అనుకున్న సినిమాలు చేయలేకపోయాననే చిన్న నిరాశతో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. నేను రీల్ మరియు నిజ జీవితంలో కొంచెం ప్రయోగాత్మకంగా ఉన్నాను. నేను సాహసోపేతమైన వ్యక్తిని. రిస్క్ తీసుకుంటాను. నాకు నచ్చినది చేస్తాను. కొంతకాలం రాజకీయాల్లో పనిచేశాను. తర్వాత సామాజిక సేవల్లో చేరాను`` అని తెలిపారు.
నరేష్ ఇంకా మాట్లాడుతూ, మాస్- క్లాస్ ఇలా అన్ని విభాగాల్లోనూ మహేష్‌కి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారతీయ సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి ఒక గొప్ప ఐకాన్. వీరిద్దరి కాంబినేషన్ తెలుగు చిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నాను అని నరేష్ అన్నారు.