'గేమ్ ఛేంజర్'కు నిరసన సెగ.. కన్నడిగుల దెబ్బకు దిగొచ్చిన టీమ్!
ఇందులో భాగంగా బెంగుళూరులో పలు చోట్ల గోడలకు అంటించిన సినిమా వాల్ పోస్టర్లపై కలర్ స్పే చల్లుతూ కొందరు కన్నడిగులు నిరసన తెలిపారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ "గేమ్ ఛేంజర్". శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. సంక్రాంతి స్పెషల్ గా జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అయితే రిలీజ్ కు ముందే ఈ మెగా మూవీకి కర్ణాటకలో నిరసన సెగ తగిలింది.
'గేమ్ ఛేంజర్' సినిమా కన్నడ వెర్షన్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం.. కర్నాటకలో తెలుగు వెర్షన్ ను విడుదల చేస్తుండటంపై అక్కడి సినీ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కన్నడలో కాకుండా కేవలం ఇంగ్లీష్ లోనే పోస్టర్లు రిలీజ్ చేస్తుందటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా బెంగుళూరులో పలు చోట్ల గోడలకు అంటించిన సినిమా వాల్ పోస్టర్లపై కలర్ స్పే చల్లుతూ కొందరు కన్నడిగులు నిరసన తెలిపారు. ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు.
నిజానికి కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఎక్కువ శాతం ఉండటంతో, కన్నడ వెర్షన్ కాకుండా నేరుగా తెలుగు భాషలోనే సినిమాలను విడుదల చేస్తుంటారు. ఒకవేళ కన్నడలో డబ్బింగ్ చేసినా, స్ట్రెయిట్ తెలుగు భాషకే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. 'గేమ్ చేంజర్' సినిమాని కూడా బెంగుళూరులో అధిక థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కన్నడలో ప్రమోషన్స్ చేయకపోవడంపై ఇప్పుడు నిరసలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా విడుదల తర్వాత చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన మేకర్స్.. ఈ నేపథ్యంలో తాజాగా కన్నడలో ప్రచారం పెట్టారు.
"గేమ్ ఛేంజర్" సినిమా కన్నడ ట్రైలర్ ను మేకర్స్ ఈరోజు శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ''మా పార్టీ సేవ చేయడం కోసం, సంపాదన కోసం కాదు" అంటూ సినిమాలోని డైలాగ్ ను కన్నడలో రాసుకొచ్చారు. మీరు ఇప్పటివరకు చూడని అతిపెద్ద గేమ్‌లో ఉన్నారని, జనవరి 10వ తారీఖున మూవీ రిలీజ్ అవుతుందని పేర్కొంటూ కన్నడ ఫాంట్ లో టైటిల్ పోస్టర్ ను పంచుకున్నారు. ఇప్పటి వరకూ కేవలం ఇంగ్లీష్ టైటిల్ తోనే పోస్టర్లు రిలీజ్ చేస్తుండటంతో.. మిగతా భాషల్లోనూ పోస్టర్లు వదలాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
కాగా, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో "గేమ్ ఛేంజర్" సినిమా రూపొందింది. ఇందులో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్. జే సూర్య విలన్ పాత్ర పోషిస్తుండగా.. శ్రీకాంత్, సముద్రఖని, సునీల్, వెన్నెల కిషోర్, జయరాం, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎస్.థమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకి తిరు, రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.