'గేమ్ ఛేంజ‌ర్'.. 30 రోజుల్లో కోపం త‌గ్గించుకోవడం ఎలా?

ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీస్తున్న 'గేమ్ ఛేంజ‌ర్' సినిమా విషయంలోనూ దర్శకుడు దాన్నే అనుసరించినట్లు తెలుస్తోంది.

Update: 2024-11-12 03:00 GMT

భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో శంకర్ షణ్ముగం ఒకరు. తన సినిమాల ద్వారా సమాజానికి ఎంతో కొంత బలమైన సందేశం ఇవ్వాలని చూసే దర్శకుడాయన. ఆ సందేశాన్ని కూడా కమర్షియల్ మూవీ ఫార్మాట్ లోనే చెప్పడం శంకర్ స్పెషాలిటీ. ఎంత పెద్ద హీరోతో సినిమా చేసినా, ఆయన ఇదే ఫార్ములా ఫాలో అవుతుంటారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీస్తున్న 'గేమ్ ఛేంజ‌ర్' సినిమా విషయంలోనూ దర్శకుడు దాన్నే అనుసరించినట్లు తెలుస్తోంది.

'గేమ్ ఛేంజ‌ర్' సినిమా చాలా ఏళ్లుగా నిర్మాణం జరుపుకుంటోంది. ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసి, వచ్చే సంక్రాంతికి విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారు శంకర్. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న టీజర్ ను రిలీజ్ చేసారు. దీనికి సోషల్ మీడియాలో రెస్పాన్స్ ఎలా ఉందనేది పక్కన పెడితే, మెగా అభిమానులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో రామ్ చరణ్ ను తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో ప్రజెంట్ చేసారు. ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ ఎక్కడా మిస్ అవ్వకుండా, శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ మూవీని తీస్తున్నట్లుగా టీజర్ తో క్లారిటీ ఇచ్చారు.

మాములుగా శంకర్ సినిమాలలో హీరోలు సమాజం పట్ల అవగాహనతో, చాలా బాధ్యతగా ఉంటారు. 'గేమ్ ఛేంజ‌ర్' చిత్రంలోనూ రామ్ చరణ్ ను అదే విధంగా చూపించబోతున్నారు. కాకపోతే కొడుకు రామ్ నందన్ పాత్రను అన్ ప్రెడిక్ట‌బుల్‌ గా తీర్చిదిద్దినట్లు టీజర్ లో కాస్త రివీల్ చేసారు. బేసిక్ గా రామ్ చాలా మంచోడే కానీ, కోపం వస్తే మాత్రం చెడ్డోడుగా మారిపోతాడంటూ హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ ఎలా ఉంటుందనేది శాంపిల్ గా చూపించారు. సినిమాలో హీరోకి కోపం కాస్త ఎక్కువే అనే విషయాన్ని డైలాగ్స్ తో వెల్లడించి ఆస‌క్తిని పెంచేశారు.

'గేమ్ ఛేంజ‌ర్' సినిమాలో రామ్ చరణ్ పాత్రకు కోపం, యాంగ‌ర్ మేనేజ్‌మెంట్ ను జత చేసినట్లు టీజర్ లో హింట్ ఇచ్చారు. కాలేజీ లైఫ్‌ లో గొడ‌వ‌లు, హీరోయిన్ కియారా అద్వానీ తండ్రిని కొట్టడం, వెన్నెల కిశోర్ ను కొట్టే ప్రయత్నం చేయడం, కోపంతో నీళ్ళలో బిగ్గరగా అరవడం, కోపాన్ని కంట్రోల్ చేసుకోడానికి ప్రయత్నించడం వంటివి ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అలానే ఒక సీన్ లో చరణ్ లైబ్రరీలో కూర్చొని '30 రోజుల్లో కోపం త‌గ్గించుకోవ‌డం ఎలా?' అనే పుస్తకాన్ని చదువుతూ కనిపిస్తాడు. మరో సన్నివేశంలో కోపాన్ని తగ్గించుకోవడానికి కారణం ఏంటో వ్రాసి ఈ విధంగా ట్రీట్ చెయ్యండి అంటూ చెర్రీ తన రూమ్ లో పేపర్లు చింపేస్తూ కనిపించాడు.

ఒకవేళ నిజంగానే సినిమాలో రామ్ నందన్ కోపిష్టి అయితే.. అలాంటి వ్యక్తి సివిల్స్ కి ప్రిపేర్ అయి ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు?, తన అన్ ప్రిడిక్టబుల్ నేచర్ తో రాజకీయాలను ఎలా ప్రక్షాళన చేశాడు? వంటివి ఆసక్తికరమైన పాయింట్స్ అనే చెప్పాలి. కోపం, యాంగ‌ర్ మేనేజ్‌మెంట్ అంశాల మీద అప్పటి 'రక్షకుడు' నుంచి ఈ మధ్య వచ్చిన 'సరిపోదా శనివారం' వరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. 'సరిపోదా శనివారం' చిత్రంలో అన్ని రోజుల కోపాన్ని దాచుకొని, వారంలో ఒక్క రోజు మాత్రమే చూపిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ ను చూపించి హిట్టు కొట్టారు. ఇప్పుడు 'గేమ్ ఛేంజ‌ర్'లోనూ హీరో పాత్రకి విపరీతమైన కోపం ఉంటుందని టీజర్ లో ప్రస్తావించారు. మరి దానికి శంకర్ తన మార్క్ స్క్రీన్ ప్లేని జోడించి ఎలాంటి సందేశం ఇచ్చారనేది చూడాలి.

ఇకపోతే భారీ తనానికి పెట్టింది పేరు డైరెక్టర్ శంకర్. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్ నిర్మాణం కోసం కోట్లు ఖర్చు చేసేస్తుంటారు. పాటలు, ఫైట్లుకే అధిక మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తారు. 'గేమ్ ఛేంజ‌ర్' సినిమాలోనూ భారీతనం కనిపిస్తోంది. గ్రాఫిక్స్ కన్నా సెట్ వర్క్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లు టీజర్ లో సాంగ్ బిట్స్ చూస్తే అర్థమవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాతో శంకర్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికైతే టీజ‌ర్ తోనే సినిమాకి మంచి హైప్‌ వచ్చింది. రానున్న రోజుల్లో వచ్చే ప్రమోషనల్ కంటెంట్ మరింత ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News