తప్పు చేస్తున్నావు సోదరా! జ్ఞానవేల్‌కి సముదిరకని వార్నింగ్!!
కార్తీ నటించిన 'పరుత్తి వీరన్' 16 సంవత్సరాల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే
కార్తీ నటించిన 'పరుత్తి వీరన్' 16 సంవత్సరాల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి జాతీయ అవార్డులు వచ్చాయి. ఇందులో సముదిరకని కూడా ఒక కీలక పాత్రలో నటించారు. అయితే ఆ సినిమా చిత్రీకరణ సమయంలో నిర్మాత జ్ఞానవేల్ రాజా డబ్బు పెట్టలేనని చేతులెత్తేశారని, ఆ తర్వాత దానిని పూర్తి చేసేందుకు దర్శకుడు అమీర్ అష్టకష్టాలకు ఓర్చి చాలా డబ్బు అప్పు తెచ్చాడని సముదిరకని అన్నారు. అయితే చివరిగా ఇదంతా తెలిసి కూడా జ్ఞానవేల్ రాజా నిర్మాత అని తన పేరు వేసుకున్నాడని, సిగ్గు లేకుండా ఆ పని చేసాడని అన్నారు.
ఇటీవల పరుత్తివీరన్ నిర్మాణానికి సంబంధించి దర్శకుడు అమీర్‌పై నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన ఆరోపణలను ఖండిస్తూ సముదిరకని ఓ లేఖను రాసారు. ఆ లేఖలో పైవిధంగా స్పందించారు. ఆ చిత్ర దర్శకత్వ బృందంలో పనిచేసిన సముద్రఖని అమీర్‌పై అసంబద్ధమైన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు జ్ఞానవేల్ రాజాను తప్పు పడుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.
జ్ఞానవేల్ రాజాను ఉద్దేశించి సముద్రఖని తన ప్రకటనలో ఇలా రాసారు. ''అమీర్ అన్న గురించి మీరు మాట్లాడిన వీడియోను నేను ఇప్పుడే చూశాను. సోదరా మీరు ఘోరమైన తప్పు చేస్తున్నారు. మీరు మాట్లాడేది దుర్మార్గం .. నిరాధారం. నేను ఈ మాట చెబుతున్నాను. సినిమా నిర్మాణంలో యూనిట్ ... అలాగే అమీర్ అన్న అన్ని సమస్యలను ఎదుర్కొన్నారో నాకు తెలుసు. అమీర్ అన్న నిన్ను నిర్మాతగా.. కార్తీని హీరోని చేసాడు. కానీ అతడి పట్ల మీకు విధేయత లేదు. ఈ చిత్రానికి సంబంధించి ఏదైనా సమస్య తలెత్తిన ప్రతిసారీ, నేను జోక్యం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఆ సమస్య మేనేజర్ ద్వారా పరిష్కారమవుతుందని ఆశించాను. కానీ ఈసారి నేను దానిని భరించలేను'' అని అన్నారు.
సూర్య - జ్ఞానవేల్ రాజా ఇద్దరూ ఈ చిత్రాన్ని వదులుకున్నారని, దర్శకుడు అమీర్ తన కెరీర్, కీర్తిని పణంగా పెట్టి తన అన్ని వైపుల నుండి అరువు తెచ్చుకున్న డబ్బుతో దానిని పూర్తి చేసాడని సముదిరకని అన్నారు. సినిమాకు అరవై మందికి పైగా నిధులు సమకూర్చారు. కానీ చివరికి మీరు సిగ్గులేకుండా నిర్మాత అనే బిరుదును తీసుకున్నారు. ఈ సమస్య కొనసాగుతున్న సమయంలో అంతటా కార్తీ మౌనంగా ఉండటం చూసి భరించలేకపోయాను.. అని అన్నారు. సముద్రఖని విషయాన్ని పక్కన పెడితే.. నటుడు-దర్శకుడు శశికుమార్ కూడా పరుత్తివీరన్ దర్శకుడు అమీర్‌కు మద్దతుగా వచ్చారు. షూటింగ్ చివరి దశకు నిధులు సమకూర్చింది తానేనని .. జ్ఞానవేల్ రాజా ఆరోపణలు అభ్యంతరకరం అవాస్తవమని పేర్కొన్నాడు.