'ఈగల్' కి తప్పని గుంటూరు కారం ఘాటు..!
సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నందుకు ఈగల్ కు సోలో రిలీజ్ దక్కేలా నిర్మాతలు ప్లాన్ చేశారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఈగల్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి కి విడుదల అవ్వాల్సిన ఈ సినిమాను ఆ సమయంలో ఉన్న తీవ్ర పోటీ కారణంగా వాయిదా వేయడం జరిగింది. సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నందుకు ఈగల్ కు సోలో రిలీజ్ దక్కేలా నిర్మాతలు ప్లాన్ చేశారు.
థియేటర్లలో ఈగల్ సినిమాకు పెద్దగా పోటీ అయితే లేదు. కానీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న గుంటూరు కారం కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేటి అర్థరాత్రి నుంచి గుంటూరు కారం సినిమా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే.
గుంటూరు కారం సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మహేష్ బాబు సినిమా అవ్వడంతో ఓటీటీ ద్వారా చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు ఆసక్తిగా ఉన్నారు. థియేటర్ కు వెళ్లి చూడకుండా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కనుక ఈగల్ సినిమా ఓపెనింగ్ విషయంలో ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు.
ఈగల్ సినిమా సంక్రాంతికి విడుదల అయ్యి ఉంటే గుంటూరు కారం తో పాటు ఇతర సినిమాల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా అదే పరిస్థితిని ఈగల్ ఎదుర్కోవాల్సి రావడం విడ్డూరం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈగల్ కి కారం ఘాటు తప్పలేదు.
మరో వైపు గుంటూరు కారం సినిమా ఇంకా థియేటర్లలో రన్ అవుతూనే ఉంది. ఇంతలో ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం లేదా రెండు వారాల తర్వాత కూడా గుంటూరు కారం ను స్ట్రీమింగ్ చేయవచ్చు. కానీ ఈగల్ కి పోటీ అన్నట్లుగా తీసుకు వచ్చారా అంటూ రవితేజ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.