'ఇండియన్ సినిమా' VFX స్టాండర్డ్స్ ను పెంచిన చిత్రాలు!

గతంలో ఇండియన్ సినిమా VFX స్టాండర్డ్స్ ను పెంచిన మరికొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.

Update: 2024-07-01 14:30 GMT

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'తెలుగు సినిమా' గురించే డిస్కషన్ నడుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ''కల్కి 2898 AD" చిత్రం వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ ఫాంటసీ మూవీ, బాక్సాఫీస్ వద్ద 4 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక ఈ సినిమాలో విజువల్స్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఇది అసలు మన తెలుగు సినిమాయేనా అని ఆశ్చర్యపోతున్నారంటే కారణం, వీఎఫ్ఎక్స్ అంత అద్భుతంగా ఉండటమే.

హిందూ పురాణాలను భవిష్యత్ ప్రపంచానికి ముడిపెడుతూ తీసిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ యాక్షన్ మూవీ 'కల్కి 2898 AD'. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 6 వేల సంవత్సరాల తర్వాత కథను ఈ చిత్రంలో ఆవిష్కరించారు. భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో ఒక విజువల్ వండర్ లా తీర్చిదిద్దారు. హలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందించారు. గతంలో ఇండియన్ సినిమా VFX స్టాండర్డ్స్ ను పెంచిన మరికొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.

Read more!

రోబో:

 

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా షో మ్యాన్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ 'రోబో'. ఇందులో ఐశ్వర్యా రాయ్ హీరోయిన్. అధునాతన ఆండ్రాయిడ్ రోబోట్‌ల కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రం, ఆడియన్స్ కు గతంలో ఎన్నడూ చూడని విజువల్ అనుభూతిని పంచింది. శంకర్ విజన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకి వి.శ్రీనివాస్ మోహన్ దాస్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్ గా వర్క్ చేశారు. ఇది 2010లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డుల కెక్కింది.

రా.వన్:

 

రోబో వీఎఫ్ఎక్స్ గురించి దేశ వ్యాప్తంగా మాట్లాడుకున్న తర్వాత, అదే బాటలో హై టెక్నికల్ వాల్యూస్ తో తీసిన సినిమా 'రా.వన్'. షారూఖ్ ఖాన్, కరీనా కపూర్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఈ సూపర్ హీరో మూవీ రూపొందింది. ఒక వీడియో గేమ్ లోని క్యారక్టర్.. వర్చువల్ ప్రపంచం నుండి వాస్తవ ప్రపంచంలోకి వస్తే ఎలా ఉంటుందో అనే ఐడియాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2011లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. దీంట్లో విజువల్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

క్రిష్ 3:

 

బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'క్రిష్ 3'. ఇండియన్ సూపర్ హీరోగా పిలవబడుతున్న క్రిష్ ఫ్రాంచైజీలో వచ్చిన మూడో చిత్రమిది. 2013లో రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. VFX , సినిమాటోగ్రఫీ విభాగాలకు ప్రశంసలు దక్కాయి. ఈ ఫ్రాంచైజీలో అంతకముందు వచ్చిన కోయి మిల్ గయా, క్రిష్ చిత్రాలు కూడా బెస్ట్ విజువల్స్ ఎక్స్ పీరియన్స్ అందించాయి.

బాహుబలి-1:

 

బిగ్ స్క్రీన్ మీద విజువల్ వండర్స్ క్రియేట్ చేసే దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఎపిక్ యాక్షన్ ఫిల్మ్ 'బాహుబలి'. మొదటి భాగాన్ని 'బాహుబలి: ది బిగినింగ్' పేరుతో 2015లో విడుదల చేశారు. ఇది భాషా అడ్డంకులు చెరిపేసి, పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ఎన్నో సరికొత్త రికార్డులను సృష్టించింది. గ్రాఫిక్స్ తో మాహిష్మతి సామ్రాజ్యాన్ని సృష్టించిన జక్కన్న.. ఇండియన్ సినిమా స్థాయిని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు. శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సన్నివేశాలకు జాతీయ అంతర్జాతీయ ప్రశంసలు దక్కాయి. టాలీవుడ్ నుంచి ఈ రేంజ్ సినిమా వచ్చిందని అందరూ నోళ్ళు వెళ్ళబెట్టారు.

బాహుబలి 2:

 

'బాహుబలి: ది బిగినింగ్' కు కొనసాగింపుగా.. రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి, తమన్నా భాటియాలతో రాజమౌళి తెరకెక్కించిన మరో విజువల్ వండర్ 'బాహుబలి: ది కన్‌క్లూజన్'. 2017లో రిలీజైన ఈ ఎపిక్ యాక్షన్ మూవీ, బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇది భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాలు దాటించింది. వెస్ట్రన్ ఆడియన్స్ సైతం విజువల్స్, యాక్షన్ గురించి గొప్పగా మాట్లాడుకునేలా చేసింది.

2.0:

 

రోబోకి సీక్వెల్ గా డైరెక్టర్ రూపొందించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ '2.0'. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రాన్ని తెరకెక్కించారు. 3D ఫార్మాట్‌లో విడుదలైన ఈ సినిమా మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఫస్ట్ పార్ట్ రేంజ్ లో లేదనే కామెంట్లు వచ్చాయి. అయినప్పటికీ 2018లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. వి. శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్ ను అంతా కొనియాడారు.

RRR:

 

ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. 2022లో వచ్చిన ఈ హిస్టారికల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. వందేళ్ల భారతీయ సినిమా ఆస్కార్ కళను సాకారం చేయటమే కాదు, హలీవుడ్ ప్రముఖులు సైతం మన సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. రాజమౌళి సమర్పణలో బాలీవుడ్ లో రూపొందిన 'బ్రహ్మాస్త్రం' సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రశంసలు అందుకున్నాయి. రణబీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇక టాలీవుడ్ నుంచి 2024 ప్రారంభంలో వచ్చిన 'హను-మాన్' మూవీ తక్కువ బడ్జెట్ లో హై క్వాలిటీ VFX తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు లేటెస్టుగా థియేటర్లలో విడుదలైన 'కల్కి 2898 AD' చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ తో ఫ్యూచర్ వరల్డ్ లోకి తీసుకెళ్ళింది. అసలు ఇది తెలుగు సినిమనేనా అని షాక్ అయ్యేలా చేసింది. అప్పట్లో 'అంజి' 'అమ్మోరు' 'అరుంధతి' లాంటి కొన్ని చిత్రాలు అందుబాటులో ఉన్న టెక్నాలజీతోనే ప్రేక్షకులకు మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్ అందించాయి.

Tags:    

Similar News