సౌతిండియాలో ఇటీవల టాలీవుడ్ పేరు మార్మోగుతోంది. కొన్ని భారీ పాన్ ఇండియా విజయాలతో చర్చల్లో నిలుస్తోంది. తెలుగు చిత్రసీమను అనుసరిస్తూ కన్నడ పరిశ్రమలోను విజయాలు నమోదవుతుండడం ఆసక్తిని పెంచగా, మాలీవుడ్ లోను అనూహ్య మార్పులు, అభివృద్ధి స్పష్ఠంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు పరిమిత బడ్జెట్ చిత్రాలతో అర్థవంతమైన కథనాలతో మాలీవుడ్ వరుస విజయాల్ని ఖాతాలో వేసుకుంటూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.
మాలీవుడ్ వరుస హిట్లతో దూసుకుపోతోంది. గడిచిన మూడు నాలుగు వారాల్లో నాలుగు విజయవంతమైన చిత్రాలను ఈ పరిశ్రమ అందించింది. ప్రేమలు, బ్రహ్మయుగం, అబ్రహం ఓజ్లర్, అన్వేషిప్పిన్ కందెతుమ్, మంజుమ్మెల్ బాయ్స్ వంటి వరుస హిట్లను అందుకోవడం ఆశ్చర్యపరిచింది. ఇటీవల విడుదలైన మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం తమిళనాడులోని గుణ గుహలలో విషాదకరమైన సంఘటనను ఎదుర్కొన్న మంజుమ్మెల్, కొచ్చికి చెందిన పదకొండు మంది యువకుల ప్రయాణానికి సంబంధించిన కథాంశం. స్నేహం, పోలీసుల నిర్లక్ష్యం, మనుగడ డ్రామా కథతో రూపొందింది.
2006లో జరిగిన ఒక నిజమైన సంఘటన నుండి ప్రేరణ పొందిన మంజుమ్మెల్ బాయ్స్ రూపొందింది. వెంటాడే గుణ గుహల నేపథ్యంలో సాగే గ్రిప్పింగ్ సర్వైవల్ డ్రామా. అనవసర ఆర్భాటం.. నేపథ్య సంగీతంపై ఆధారపడకుండా ఇది షైజు ఖలీద్ అద్భుతమైన సినిమాటోగ్రఫీతో వాస్తవికత నిండిన మానవ భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిందని చెబుతున్నారు. అద్భుతమైన ప్రామాణికత ఉన్న కథనం స్టోరి టెల్లింగ్, అత్యుత్తమ నట ప్రదర్శనలతో ఉత్కంఠభరితమైన విజువల్స్ ఆద్యంతం రక్తి కట్టించాయని క్రిటిక్స్ ప్రశంసించారు. ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు దేశీయంగా మొదటిరోజు 3.85 కోట్లు ఆర్జించిన ఈ చిత్రం విదేశాల నుంచి 363K డార్లు (రూ3 కోట్లు) రాబట్టింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.6.9 కోట్లు వసూలు చేసింది.