రాబిన్ హుడ్ వాయిదా?

ఆ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీస్ అధినేతలే ఈ మూవీని కూడా నిర్మించిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-12 05:36 GMT

క్రిస్మస్‌ కానుకగా తెలుగు నుంచి రాబోతున్న క్రేజీ చిత్రాల్లో 'రాబిన్ హుడ్' ఒకటి. నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్లో 'భీష్మ' తర్వాత రానున్న సినిమా కావడం.. ఇప్పటిదాకా వచ్చిన ప్రోమోలన్నీ ఆకట్టుకోవడంతో దీనికి ఇటు ట్రేడ్ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. 'గేమ్ చేంజర్' క్రిస్మస్‌కు వచ్చేట్లయితే ఆ సీజన్ నుంచి తప్పుకోవాలని అనుకున్నారు కానీ.. ఆ చిత్రం సంక్రాంతికి వెళ్లిపోవడంతో దీనికి ఇబ్బంది లేకపోయింది. రిలీజ్ దగ్గర పడేకొద్దీ ప్రమోషన్ల జోరు కూడా పెంచారు. కానీ ఇప్పుడేమో అనూహ్యంగా వాయిదా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని క్రిస్మస్ రేసు నుంచి తప్పించి సంక్రాంతి లేదా ఆ తర్వాతి వారాల్లో రిలీజ్ చేయడం గురించి ఆలోచిస్తున్నారట. ఇందుకు కారణం.. పుష్ప-2 అని అంటున్నారు. ఆ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీస్ అధినేతలే ఈ మూవీని కూడా నిర్మించిన సంగతి తెలిసిందే.

'పుష్ప-2' ప్రస్తుతం నిలకడగా వసూళ్లు రాబడుతోంది. దీనికి లాంగ్ రన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పది రోజుల తర్వాత టికెట్ల ధరలు కూడా తగ్గుతున్న నేపథ్యంలో ఈ నెల చివరి వరకు మంచి ఆక్యుపెన్సీలు ఉంటాయని భావిస్తున్నారు. ఐతే క్రిస్మస్‌కు చాలా సినిమాలు రిలీజవుతుండడంతో థియేటర్ల సమస్య తప్పేలా లేదు. వేరే చిత్రాలకు స్క్రీన్లు పోగా.. మిగిలే వాటిలో పుష్ప-2, రాబిన్ హుడ్ మధ్య క్లాష్ తప్పేలా లేదు. కొత్త సినిమా కోసం పుష్ప-2ను తీసేయాల్సి ఉంటుంది. అది మైత్రీ వాళ్లకు ఇబ్బంది. అలా అని పుష్ప-2ను ఎక్కువ స్క్రీన్లలో కొనసాగిస్తే 'రాబిన్ హుడ్'కు సమస్య అవుతుంది. అందుకే నితిన్ మూవీని వాయిదా వేయడం గురించి ఆలోచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ నితిన్ మాత్రం ఇందుకు ఎంతమాత్రం సుముఖంగా లేడట. అతను, దర్శకుడు వెంకీ క్రిస్మస్ రిలీజ్ కోసమే పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News