భారతదేశంలో అత్యంత సంపన్న నటి ఎవరు?
హిందీ చిత్రసీమతో పాటు తెలుగు, తమిళ పరిశ్రమల్లోను జూహీ సుపరిచితురాలు.
భారతదేశంలో అత్యంత ధనికురాలైన సినీ నటి ఎవరు? అంటే .. తొలిగా స్ట్రైక్ అయ్యే పేర్లు కొన్ని ఉన్నాయి. దీపిక పదుకొనే, ప్రియాంక చోప్రా, అలియా భట్, కత్రినా, ఐశ్వర్యారాయ్ ఇలా కొందరి పేర్లు చెబుతారు. కానీ ఈ భామలందరి కంటే ధనవంతురాలైన కథానాయిక మన దేశంలో ఉన్నారు. భారతదేశపు అత్యంత ధనిక నటి నికర ఆస్తుల విలువ రూ. 4600 కోట్లు. గడిచిన 15 ఏళ్లలో ఒక్క హిట్ సినిమాలో కూడా కనిపించలేదు. అయినా తన రేంజు ఎక్కడా తగ్గలేదు. వివరాల్లోకి వెళితే... ఈ సంపన్న కథానాయిక మరెవరో కాదు.. ది గ్రేట్ జూహీ చావ్లా. ఈ వెటరన్ నటి మాధురి ధీక్షిత్, కరిష్మా కపూర్ లాంటి కథానాయికల కంటే సీనియర్. అగ్ర కథానాయికగా సినీపరిశ్రమను ఏలారు. హిందీ చిత్రసీమతో పాటు తెలుగు, తమిళ పరిశ్రమల్లోను జూహీ సుపరిచితురాలు.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ఎడిషన్ వివరాల ప్రకారం.. ధనిక కథానాయికల జాబితాలో జూహీ చావ్లా పేరు కనిపించింది. నిజం చెప్పాలంటే దేశంలో అత్యంత ధనిక నటుడిగా షారూఖ్ నిలిస్తే.. మహిళా నటీమణుల్లో జూహీ చావ్లానే నంబర్ 1 ఆస్తిపరురాలిగా రికార్డుల్లో కనిపించింది. షారూఖ్ 7300 కోట్ల ఆస్తులతో నంబర్-1 స్థానంలో నిలవగా, జూహీ చావ్లా 4600 కోట్ల నికర ఆస్తి విలువతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచిందని హురూన్ ఇండియా వెల్లడించింది.
90వ దశకంలో హిందీ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటీమణుల్లో జూహీ చావ్లా ఒకరు. ఖయామత్ సే ఖయామత్ తక్‌తో తెరంగేట్రం చేసిన తర్వాత 90లలో బోల్ రాధా బోల్, డర్, లోఫర్, ఇష్క్ వంటి హిట్ చిత్రాలతో బాక్సాఫీస్‌ను శాసించింది. కానీ 2000 తర్వాత పూర్తిగా నిర్మాతగా కొనసాగారు. కొన్నిసార్లు సహాయ పాత్రల్లో కనిపించారు. జూహీ చిత్ర నిర్మాణంలో షారుఖ్ భాగస్వామి. మొదట డ్రీమ్స్ అన్‌లిమిటెడ్ .. ఇప్పుడు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో జూహీ భాగస్వామిగా ఉన్నారు. 2009 నుండి (లక్ బై ఛాన్స్ విడుదలైనప్పుడు) జూహీకి బాక్సాఫీస్ హిట్ లేకపోయినా, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పెట్టుబడి పెట్టడం .. నైట్ రైడర్స్ క్రికెట్ ఫ్రాంచైజీ సహ-యజమాని కావడం వల్ల జూహీ ఆదాయం ఎన్నో రెట్లు పెరిగింది. ఐశ్వర్య రాయ్ (రూ. 900 కోట్లు), ప్రియాంక చోప్రా (రూ. 850 కోట్లు), అలియా భట్ (రూ. 550 కోట్లు), దీపికా పదుకొనే (రూ. 400 కోట్లు), కత్రినా కైఫ్ (రూ. 240 కోట్లు) వంటి అగ్రశ్రేణి కథానాయికల ఆదాయాలన్నిటినీ కలిపినా అంతకుమించి అని జూహీ నిరూపించింది.
భారతదేశంలో నం.1 ధనికుడు అదానీ:
11.6 లక్షల కోట్ల నికర ఆస్తి విలువతో అత్యంత సంపన్న భారతీయుడిగా ముఖేష్ అంబానీ స్థానంలో గౌతమ్ అదానీ అగ్రస్థానం దక్కించుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు వల్ల ఏర్పడిన నష్టాన్ని తిరిగి రికవరీ అవుతూ.. గత ఏడాది గౌతమ్ అదానీ నికర ఆస్తుల విలువ 95 శాతం పెరిగి రూ. 11.6 లక్షల కోట్లకు చేరుకుందని, ఇది ముఖేష్ అంబానీ స్థానంలో అత్యంత సంపన్న భారతీయుడిగా అవతరించడానికి సహాయపడిందని జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి.