కంగ‌న 'ఎమ‌ర్జెన్సీ' మ‌ళ్లీ రిలీజ్ వాయిదా!

కంగనా రనౌత్ ఇటీవ‌ల త‌న‌పై జ‌రుగుతున్న రాజ‌కీయ కుట్ర‌ల గురించి బ‌హిరంగంగా మాట్లాడుతోంది.

Update: 2024-09-02 03:41 GMT

కంగనా రనౌత్ ఇటీవ‌ల త‌న‌పై జ‌రుగుతున్న రాజ‌కీయ కుట్ర‌ల గురించి బ‌హిరంగంగా మాట్లాడుతోంది. హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ మండి నుంచి ఎన్నిక‌య్యాక ఎంపీగా ప్ర‌జ‌ల్లో ఉన్న‌ త‌నకు మ‌రింత‌గా చిక్కులు వ‌చ్చి ప‌డుతున్న‌ట్టు కూడా వ్యాఖ్యానించింది. ఇంత‌లోనే ఇప్పుడు కంగ‌న న‌టించి నిర్మించిన‌ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `ఎమర్జెన్సీ` విడుద‌ల‌ను వాయిదా వేయాల్సి వ‌చ్చింది.

దీనికి కార‌ణం ఈ సినిమాకి కొన్ని అడ్డంకులు త‌లెత్త‌డ‌మే. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా రూపొందించిన పొలిటిక‌ల్ డ్రామా `ఎమర్జెన్సీ`కి కంగ‌న స్వ‌యంగా దర్శకత్వం వహించ‌డ‌మే గాక‌, ఇందులో టైటిల్ పాత్ర‌ను పోషించింది. పోస్ట‌ర్లు విజువ‌ల్స్ కి మంచి స్పంద‌న వ‌చ్చింది. కానీ దీంతో పాటే వివాదాలు చుట్టుముట్టాయి. కార‌ణం ఏదైనా కానీ, ఎమర్జెన్సీ విడుదల చాలాసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి వ‌స్తుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కానీ ఇది కూడా సాధ్య‌ప‌డ‌టం లేదు.

ఇందిర‌పై సినిమాని నిషేధించాలంటూ దేశవ్యాప్తంగా సిక్కు నేతలు నిరసనలు వ్యక్తం చేయడంతో సినిమా వివాదంలో పడింది. ట్రైలర్‌లోని కొన్ని డైలాగులు సిక్కు సమాజం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని. ట్రైలర్ తమ కమ్యూనిటీని తప్పుగా చూపిస్తోంద‌ని, ముఖ్యంగా ఖలిస్తానీ వేర్పాటువాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే పాత్రను చిత్రీకరించారని సిక్కు గ్రూపులు వాదించాయి. సినిమా విడుదలను నిషేధించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC), సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు లేఖలు పంపారు.

అంతేకాదు .. పంజాబ్, హర్యానా హైకోర్టుల్లో ఎమ‌ర్జెన్సీ మేక‌ర్స్ పై పలు కేసులు నమోదయ్యాయి. సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని వారంతా కోరుతున్నారు. అందుకే ఇంకా ఎమ‌ర్జెన్సీ టీమ్‌కి సెన్సార్ సర్టిఫికేట్ మంజూరు కాలేదు అని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. ముప్పిరిగొలుపుతున్న తాజా వివాదాల‌ను పరిగణనలోకి తీసుకుని సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్మాత‌లు నిర్ణయించుకున్నారు. కొత్త ఎమర్జెన్సీ తేదీని త్వరలోనే వెల్ల‌డిస్తార‌ని స‌మాచారం.

Tags:    

Similar News