కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన కంగన
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజక వర్గం నుంచి పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే లోక్‌సభకు ఎంపికైంది
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజక వర్గం నుంచి పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే లోక్‌సభకు ఎంపికైంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగనా, రాజకీయాల్లో కూడా అదే ఫైర్ ను చూపించి సక్సెస్ అయింది. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కంగనా ఇప్పుడు తాజాగా వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టింది.
ప్రేమికుల రోజు సందర్భంగా కంగనా ఈ బిజినెస్ ను మొదలుపెట్టింది. అయితే కంగనా మొదలుపెట్టిన బిజినెస్ మరేదో కాదు. ఆమె హిమాచల్ లో ఓ రెస్టారెంట్ ను స్టార్ట్ చేసింది. ది మౌంటెన్ స్టోరీ పేరిట ఓ చిన్న కేఫ్ తో తాను ఈ బిజినెస్ లోకి అడుగుపెట్టినట్టు కంగనా ఫోటోలను షేర్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రమ్ లో వెల్లడించింది.
ఈ రెస్టారెంట్ పెట్టడం తన చిన్న నాటి కల అని, ఆ కల నెరవేరుతున్నందుకు తనెకంతో సంతోషంగా ఉందని, ఇది కేవలం భోజనం చేసే కేఫ్ మాత్రమే కాదని, తన తల్లి వంటగది సువాసనలకు నిలయమని కంగనా ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ రాసుకొచ్చింది. ఈ సందర్భంగా కంగనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాల్యాన్ని గుర్తు చేసుకుంది.
కంగనా చిన్నగా ఉన్నప్పుడు తన తల్లి ఆమెను ఇంటి పనులు చేయమని చెప్పేదని, ఓ మహిళగా ఇంటి పనులకే ఎక్కువ టైమ్ కేటాయించాలని చెప్పేదని, కూరగాయలు పండిచడం, ఊరగాయ పెట్టడం లాంటివన్నీ నేర్చుకోమని చెప్పేదని, ఆ మాటలన్నీ తనకప్పుడు తెలివితక్కువగా ఉండేవని, ఆ పనులు నేర్చుకోవడం వల్ల ఏమీ ఉపయోగముండదనుకున్నట్టు కంగనా తెలిపింది.
తన తల్లి మాటలకు ఇప్పుడు అర్థం తెలుస్తోందని, అందుకే తాను కేఫ్ ప్రారంభించినట్టు చెప్పింది. ఈ కేఫ్ స్టార్ట్ చేసినందుకు తన తల్లి ఎంతో సంతోషంగా ఉందని, తాను తెలివైనదాన్ని అయ్యానని తన తల్లి భావిస్తోందని కంగన చెప్పింది. ది మౌంటెన్ స్టోరీతో హోటల్ రంగంలోకి అడుగుపెట్టిన కంగనకు ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
అయితే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. శిల్పా శెట్టి, మలైకా అరోరా ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, మౌనీ రాయ్ కు రెస్టారెంట్ బిజినెస్ లు ఉన్నాయి. ఇక కంగనా సినీ కెరీర్ విషయానికొస్తే అమ్మడు జనవరిలో ఎమర్జెన్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మిక్డ్స్ టాక్ అందుకుంది. ప్రస్తుతం కంగనా మాధవన్ తో ఓ సినిమా చేస్తుంది.