తాత 3 సార్లు ఎమ్మెల్యే..అందుకే కంగన!
మా తాత వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ సక్సస్ చూసే పార్టీలో ఆహ్వానించాయి. నా తల్లి...సోదరిని కూడా వివిధ పార్టీలు అప్రోచ్ అయ్యాయి.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరుపు ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో మొట్ట మొదటి సారే జయకేతనం ఎగరేసి సత్తా చాటింది. దీంతో కంగనకి సినిమా ల్లోనూ తిరుగులేదు..రాజకీయాల్లోనూ ఎదురు లేదంటూ దూసుకొచ్చింది. ఇప్పుడు మండి నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బరువైన బాధ్యత ఆమె పై ఉంది. పార్టీ నమ్మి టికెట్ ఇచ్చింది.
ప్రజలు సైతం అంతే నమ్మకంతో ఆమెని గెలిపించి గొప్ప పదవిని, గౌరవాన్ని కట్టబెట్టారు. ఎలాంటి రాజకీయం వారసత్వం లేకుండానే కంగన ఎన్నికల్లో సత్తా చాటిందని అంతా అనుకుంటోన్న తరుణం ఇది. కేవలం నటిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని...డబ్బు సంపాదించిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి నిలబడిందని అంతా భావిస్తున్నారు. కానీ కంగనకి రాజకీయ వారసత్వం ఉందన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ విషయాన్ని స్వయంగా ఆమె రివీల్ చేసింది. `రాజకీయాల నుంచి పిలుపు రావడం కొత్త కాదు. నా తొలి సినిమా రిలీజ్ అనంతరమే పార్టీల నుంచి పిలుపు వచ్చింది. అందుకు కారణం లేకపోలేదు. మా తాత వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ సక్సస్ చూసే పార్టీలో ఆహ్వానించాయి. నా తల్లి...సోదరిని కూడా వివిధ పార్టీలు అప్రోచ్ అయ్యాయి. నాకు ఆసక్తి లేకపోతే ఇంతవరకూ వచ్చేదాన్ని కాదు.
సినిమాల్లో నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఎంతో కష్టపడి ఎదిగాను. ఇండస్ట్రీలో ఎన్నో రకాలగా శ్రమించాను. రాజకీయ జీవితంలో కూడా అలాగే కొనసాగుతాను. జనంలోకి వెళ్లాలనిపించినప్పడు ఏమాత్రం ఆలోచించను. దూసుకుపోవడానికి ఎప్పుడూ సిద్దంగానే ఉంటాను. సవాళ్లు నాకు కొత్త కాదు. కానీ రాజకీయాలకంటే సినిమాలు ఈజీ` అని తెలిపింది.