కంగువాతో సూర్య కొత్త ట్రెండ్ సెట్.. కానీ..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాకు సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తున్న కంగువాను అత్యంత భారీ బడ్జెట్ తో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. పదికి పైగా భాషల్లో విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ద్వారా సినిమాపై ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేస్తున్నారు.
అయితే కంగువా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలను వాయిదా వేయాలని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. తమ వద్ద తీసుకున్న మొత్తం డబ్బులు చెల్లించలేదని నిర్మాత జ్ఞానవేల్ పై కేసు వేసింది. దీంతో జ్ఞానవేల్.. నవంబర్ 7వ తేదీ వరకు సమయం అడిగారు. అప్పటికి మొత్తం క్లియర్ చేస్తే కంగువా విడుదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవ్. ఆ విధంగానే జ్ఞానవేల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది
అది పక్కనపెడితే తెలుగులో బాహుబలి.. తమిళంలో కంగువా అంటూ మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో తెలుగులో సూర్యకు మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన సినిమాలన్నీ కోలీవుడ్ తో పాటు ఇక్కడ కూడా రిలీజ్ అవుతుంటాయి. దీంతో ఇప్పుడు కంగువాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నవంబర్ 14వ తేదీన మార్నింగ్ 4 గంటల షోలకు అనుమతులు తీసుకోనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు హీరోల సినిమాలకు మార్నింగ్ 4 గంటల షోలు పడడం కామనే. కానీ డబ్బింగ్ సినిమాకు స్పెషల్ షోలు అంటే విశేషమే. దానికి తోడు కోలీవుడ్ స్టార్ హీరోలు రజినీకాంత్, విజయ్ చిత్రాలకు ఎప్పుడూ ఎర్నీ మార్నింగ్ షోలు పడలేదు. ఇప్పుడు సూర్య ట్రెండ్ సెట్ చేయనున్నారన్నమాట. అదే సమయంలో తమిళనాడులో బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఉండదు. దీంతో తమిళ హీరో అయిన సూర్య సినిమా.. అక్కడ కన్నా ఇక్కడే పడనుంది.
దీంతో ఆంధ్ర, తమిళనాడు బోర్డర్ లోని థియేటర్స్ కు కోలీవుడ్ సూర్య ఫ్యాన్స్ కచ్చితంగా వచ్చి సినిమా చూస్తారు. అది ఓకే గానీ.. ఎర్లీ మార్నింగ్ షోలకు ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలని నెటిజన్లు చెబుతున్నారు. సూర్యకు తెలుగులో ఫ్యాన్స్ ఉన్నా.. ఎర్లీ మార్నింగ్ షోకు వెళ్లేంత అభిమానం ఉందో లేదో చూడాలని అంటున్నారు. సూర్యకు ఇదొక సవాల్ అని అభిప్రాయపడుతున్నారు. మరి నవంబర్ 14వ తేదీన ఏం జరుగుతుందో వేచి చూడాలి.