ఆ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఓటీటీ ఇదే!
ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా టైమ్ లో అన్నీ మూతపడటంతో ప్రజలంతా ఇళ్లల్లో ఓటీటీలకు అతుక్కుపోయారు
ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా టైమ్ లో అన్నీ మూతపడటంతో ప్రజలంతా ఇళ్లల్లో ఓటీటీలకు అతుక్కుపోయారు. సినిమాలు సైతం నేరుగా ఓటీటీల్లోనే విడుదలయ్యాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5, డిస్నీ హాట్ స్టార్, అహా, ఎంఎక్స్ ప్లేయర్ వంటివాటికి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. ఇవన్నీ ప్రైవేటు రంగానికి చెందినవారివే. ప్రభుత్వ రంగంలో ఇప్పటివరకు ఒక్క ఓటీటీ ఫ్లాట్ఫామ్ కూడా లేదు.
ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఓటీటీని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. సీస్పేస్ (CSpace) పేరుతో ఈ ఓటీటీని తెస్తున్నట్టు వెల్లడించింది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మార్చి 7న కైరాలీ థియేటర్‌లో కేరళ ఓటీటీ సీస్పేస్ (CSpace) ఫ్లాట్ఫామ్ ను ప్రారంభించనున్నారు. ఇది కేరళ రాష్ట్ర డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ రంగంలో సంచలనం సృష్టిస్తుందని భావిస్తున్నారు.
సీస్పేస్ (CSpace) ఓటీటీలో ప్రత్యేకించి ప్రజల కోసం రూపొందించిన విజ్ఞాన సమాచారం, వినోదభరితమైన కంటెంట్ ఉంటుంది. ఓవైపు ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందించడం, మరోవైపు వారికి వినోదభరితమైన కంటెంట్ ను అందించడమే తమ లక్ష్యమని కేరళ ప్రభుత్వం తెలిపింది. సీస్పేస్ (CSpace) ఓటీటీ దేశంలోనే ప్రభుత్వం అందిస్తున్న ఓటీటీగా రికార్డు సృష్టిస్తుందని వెల్లడించింది. కాగా సీస్పేస్ ఓటీటీకి కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్ చైర్మన్ గా ఉంటారు.
ప్రముఖ చిత్ర దర్శకుడు, కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ షాజీ ఎన్ కరుణ్ ఈ ఓటీటీ గురించి మీడియాకు వివరించారు. ఓటీటీ పెరుగుతున్న అసమతుల్యతలు, అనేక రకాల సవాళ్లను ఎదుర్కోవటానికి ప్రభుత్వం సీస్పేస్ (CSpace) ప్లాట్‌ఫారమ్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కంటెంట్ ఎంపికతోపాటు ప్రచారం పరంగా ఓటీటీ రంగంలో పెరుగుతున్న అసమతుల్యత, అనేక రకాల సవాళ్లకు సీస్పేస్ (CSpace) ఓటీటీ సమాధానమన్నారు.
కాగా స్పీసేస్ (CSpace) ఓటీటీని కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఇది మలయాళ సినిమా, సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ.
ఇక సీస్పేస్ (CSpace) ఓటీటీలో కంటెంట్ ను కేరళ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఎంపిక చేస్తుంది. ఇందులో భాగంగా కంటెంట్‌ని ఎంపిక చేయడం, ఆమోదించడం కోసం 60 మంది సభ్యులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ కళా రంగాలకు చెందినవారు సభ్యులుగా ఉన్నారు.
వీరు సీస్పేస్ లో (CSpace) వచ్చే కంటెంట్ ను పరిశీలిస్తారు. వీరి ఆమోదం తర్వాతే కంటెంట్ ప్రసారమవుతుంది.