నీ స్థాయికి పాన్ ఇండియానా.. హీరో జవాబిది
ఇదే విషయాన్ని సోమవారం జరిగిన ప్రెస్ మీట్లో ఒక విలేకరి కిరణ్ దగ్గర ప్రస్తావించారు.
ఈ రోజుల్లో చిన్న స్థాయి సినిమాలకు కూడా పాన్ ఇండియా రిలీజ్ అని అనౌన్స్ చేయడం చూస్తున్నాం. అలా ప్రకటిస్తున్న సినిమాల్లో చాలా వరకు సొంత భాషలో కూడా ప్రభావం చూపట్లేదు. పాన్ ఇండియా రిలీజ్ అన్నది ప్రకటనలకే పరిమితమవుతోంది. ఈ నేపథ్యంలో యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం కూడా తన కొత్త చిత్రం 'క'ను పాన్ ఇండియా స్థాయి రిలీజ్ అని ప్రకటించుకున్నాడు. మీటర్, రూల్స్ రంజన్ లాంటి డిజాస్టర్లతో కిరణ్ తెలుగులోనే మార్కెట్‌ను బాగా దెబ్బ తీసుకున్న సంగతి తెలిసిందే.
అలాంటిది ఇప్పుడు ఏకంగా 'క'ను పాన్ ఇండియా రిలీజ్‌గా అనౌన్స్ చేయడంతో అతడిపై కౌంటర్లు పడుతున్నాయి. ఇదే విషయాన్ని సోమవారం జరిగిన ప్రెస్ మీట్లో ఒక విలేకరి కిరణ్ దగ్గర ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోనే పాన్ ఇండియా సినిమాలు చేయట్లేదని.. అలాంటిది తన సినిమాలు తెలుగులోనే సరిగా ఆడట్లేదని స్వయంగా చెబుతున్న కిరణ్.. పాన్ ఇండియా సినిమా చేయడమేంటి అని ఆ విలేకరి ప్రశ్నించారు.
దీనికి కిరణ్ బదులిస్తూ.. ''పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటే ఆయన బ్రహ్మాండంగా చేయొచ్చు. ఆయన అలాంటి ప్రయత్నం చేయలేదంతే. నా విషయానికి వస్తే.. స్థాయి అనేది హీరోను బట్టి కాదు, కంటెంట్‌ను బట్టి అనుకుంటున్నా. 'క' కథ పాన్ ఇండియా స్థాయికి వెళ్లగలదని బలంగా నమ్మాను. కాబట్టే వేర్వేరు భాషల్లో దాన్ని రిలీజ్ చేయాలని అనుకున్నాం. నా తర్వాతి చిత్రం తెలుగు వరకే రిలీజ్ అవుతుంది.
ఏదో పాన్ ఇండియా సినిమా చేయాలని నేను చేయను. కథను బట్టే ఏదైనా ఉంటుంది. సినిమాలో విషయం ఉంటే అన్ని భాష ప్రేక్షకులూ దాన్ని ఆదరిస్తారు. మంజుమ్మల్ బాయ్స్‌లో నటులెవరో మనకు తెలియదు. ఆదరించాం. 'కాంతార' వచ్చినపుడు కూడా అందులో ఎవరు నటించారో మనకు తెలియదు'' అని కిరణ్ సమాధానం ఇచ్చాడ.