కోలీవుడ్‌కు ₹1000 కోట్ల క్లబ్ కలగానే మిగిలిపోడానికి కారణాలు ఇవేనా?
ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్ ఈ ఫీట్ సాధించాయి కానీ.. కోలీవుడ్ & మాలీవుడ్ లు మాత్రం ఈ మార్క్ కి ఆమడ దూరంలోనే ఆగిపోతున్నాయి.
ఇండియన్ సినిమాలో ఒకప్పుడు ₹500 కోట్లను మైలురాయి మార్క్ గా భావించే వాళ్లు కానీ, ఇటీవల కాలంలో ₹1000 కోట్ల క్లబ్ అనేది మైల్ స్టోన్ గా మారిపోయింది. ప్రతీ స్టార్ ఫిలిం మేకర్, ప్రతి ఒక్క అగ్ర హీరో ఇప్పుడు వెయ్యి కోట్ల క్లబ్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. దీని కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్ ఈ ఫీట్ సాధించాయి కానీ.. కోలీవుడ్ & మాలీవుడ్ లు మాత్రం ఈ మార్క్ కి ఆమడ దూరంలోనే ఆగిపోతున్నాయి.
టాలీవుడ్ నుండి ఇప్పటి వరకూ నాలుగు సినిమాలు ₹1000 కోట్లకు పైగా గ్రాస్ సినిమాలు వచ్చాయి. 'బాహుబలి 2' మూవీ వెయ్యి కోట్ల క్లబ్ ను క్రియేట్ చేయడం.. ఆ తర్వాత RRR, 'కల్కి 2898 AD' సినిమాలు ఆ క్లబ్ లో చేరాయి. ఇప్పుడు లేటెస్టుగా 'పుష్ప 2: ది రూల్' సినిమా అత్యంత వేగంగా కేలవం 6 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది. ఇక కన్నడ నుంచి 'KGF: చాప్టర్ 2'.. హిందీ నుంచి 'దంగల్', 'పఠాన్', 'జవాన్' చిత్రాలు ఈ ఫీట్ ను అధిగమించాయి.
ఓవరాల్ గా 8 భారతీయ సినిమాలు 1000+ కోట్ల గ్రాస్ సాధించిన జాబితాలో ఉన్నాయి. కానీ ఒక ఏడాదిలో అత్యధిక సినిమాలు అందించే తమిళ ఇండస్ట్రీకి మాత్రం వెయ్యి కోట్ల క్లబ్ అందని ద్రాక్షలా మిగిలిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా లిమిటెడ్ బడ్జెట్ తో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తుంటారు. కానీ తమిళంతో భారీ బడ్జెట్ తో హ్యూజ్ స్కేల్ లోనే మూవీస్ తెరకెక్కిస్తుంటారు. అయినా సరే బాక్సాఫీస్ దగ్గర ఆ రేంజ్ లో పెర్ఫామ్ చేయలేకపోతున్నాయి.
కోలీవుడ్‌కు ₹1000 కోట్ల క్లబ్ అనేది కలగానే మిగిలిపోడానికి కారణాలు ఏంటని ప్రశ్నిస్తే.. సోషల్ మీడియాలో తమిళం తంబీలు అనేక రీజన్స్ చెబుతున్నారు. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథలను తెరకెక్కించకపోవడం.. నేషనల్ వైడ్ ప్రమోషన్స్ చేయకపోవడం.. హిందీలో తమిళ సినిమాలకు పెద్దగా మార్కెట్ లేకపోవడం ప్రధాన కారణమని అభిప్రాయ పడుతున్నారు. మంచి చిత్రాలు రూపొందించినా, దాన్ని తగిన విధంగా నార్త్ లో ప్రమోట్ చేయడం లేదని.. మేకర్స్ కు సరైన మార్కెటింగ్ స్ట్రాటజీ లేదని అంటున్నారు.
పాన్ ఇండియాకి కనెక్ట్ అయ్యే కమర్షియల్ కంటెంట్ తో సినిమాలు తీయాలని.. తమిళ దర్శకులు తమ మూవీ మేకింగ్, ప్రమోట్ చేసే విధానాన్ని మార్చుకుంటే కోలీవుడ్ కూడా వెయ్యి కోట్ల సినిమా తీయగలదని కామెంట్స్ చేస్తున్నారు. తమిళ ఇండస్ట్రీకి ఇతర పరిశ్రమల నుంచి సరైన మద్దతు ఇవ్వడం లేదని, ఇతర రాష్ట్రాల్లో చాలా తక్కువ థియేటర్లు కేటాయిస్తున్నారని అంటున్నారు. శంకర్, మణిరత్నం లాంటి అగ్ర దర్శకులు ఫామ్ కోల్పోవడం ఒక రీజన్ అనేవాళ్ళు కూడా ఉన్నారు.
తమిళంలో ఒక హీరో మరో హీరో ఎదుగుదలను జీర్ణించుకోలేకపోవడం ప్రధాన కారణమని కొందరు అభిప్రాయ పడుతున్నారు. టాలీవుడ్ మాదిరిగా అక్కడ ఒకరి సినిమాలకు మరొకరు సపోర్ట్ చేసుకోరని అంటున్నారు. తెలుగులో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటే, ఇతర చిత్రాలను వాయిదా వేసుకుని మరీ మద్దతు ఇస్తారని.. సినిమా బాగుంటే ఏదీ మనసులో పెట్టుకోకుండా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ప్రశంసిస్తారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
నిజానికి ఇటీవల వచ్చిన 'కంగువ' మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందని అంతా భావించారు. పాన్ ఇండియా వైడ్ గా గట్టిగా ప్రమోషన్స్ చేశారు. కానీ సినిమాలో అంత బలం లేకపోవడంతో, బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. అయినప్పటికీ తమిళనాడులో సరైన సపోర్టు లభించి ఉంటే ఓపెనింగ్స్ బెటర్ గా వచ్చేవి అనే అభిప్రాయాలు ఉన్నాయి. భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికి సరిపడా థియేటర్లు కూడా ఇవ్వలేదనే కామెంట్స్ ఉన్నాయి. ఏదేమైనా 'కూలీ', 'థగ్ లైఫ్', 'విక్రమ్ 2', 'ఖైదీ 2' లాంటి చిత్రాలకు 1000 కోట్లు కొట్టే సత్తా ఉందని అంటున్నారు. చూద్దాం.. ఏ తమిళ సినిమా ఆ ఫీట్ అందుకుంటుందో..!