బుర్రిపాలెంలో కృష్ణ కాంస్య విగ్రహం!
అభిమానులు కృష్ణ జ్ఞాపకార్దం కాంస్య విగ్రహౄన్ని ఆవిష్కరించబోతున్నారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమకి సూపర్ స్టార్ కృష్ణ అందించిన సేవల గురించి చెప్పాల్సిన పనిలేదు. పరిశ్రమ లో ఆయన ఓ చెరగని సంతకం. అత్యధిక చిత్రాల్లో నటించిన ఏకైక ఓ లెజెండ్. బుర్రిపాలెం బుల్లోడిగా ఆయనో సంచలనం. ఆయన కు స్వగ్రామం అంటే ఎంతో ఇష్టం. సినిమాల్లోకి వెళ్లినా ఏ నాడు స్వగ్రామాన్ని మరువలేదు.హైదరాబాద్ లో స్థిరపడిన తర్వాత కూడా సొంత ఊరుకి వెళ్లేవారు. ఇప్పటికీ గ్రామం లో మూడంతస్తుల భవనం ఉంది. ఆయన కుటుంబ సభ్యులు ఎవరెళ్లినా ఆ ఇంట్లోనే బస.
కృష్ణ తల్లి పేరు నాగరత్నమ్మ. ఆమె పేరుమీదే పాఠశాల ఉంది. గీతా మందిరం.. బస్టాఫ్.. ఆలయం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు.. అభిమానులు కృష్ణ జ్ఞాపకార్దం కాంస్య విగ్రహౄన్ని ఆవిష్కరించబోతున్నారు. ఆగస్టు 5 ఈ కార్యక్రమం చేస్తున్నట్లు ఆదిశేష గిరిరావు తెలిపారు. కృష్ణ..మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాస్వామి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
విజయవాడ నుంచి బుర్రిపాలెం వరకూ ర్యాలి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పలువురు సీనీ, రాజకీయప్రముఖులు కూడా తరలి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. విగ్రహాన్ని తెనాలికి చెందిన సూర్య శిల్ప శాల లో ప్రత్యేకంగా తయారు చేయించారు. వాస్తవానికి ఈ ఆవిష్కరణ కార్యక్రమం గత మూడు నెలల నుండి వాయిదా పడుతూ వస్తుంది. కృష్ణ పుట్టిన రోజైన మే 31న విగ్రహావిష్కరణ చేయాలనుకున్నారు. కానీ అప్పుడు సాద్యపడలేదు. తాజాగా అధికారికంగా తేదీ ప్రకటించడంతో అభిమానులు..గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ వేడుక కు మహేష్ విచ్చేస్తారా? లేదా? అన్నది తెలియాలి. స్వగ్రామంలో తండ్రి కాంస్య విగ్రహం ఆవిష్కరణకు ఆయన వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన షూట్లో బిజీ గా ఉన్నారా? విదేశాలకు వెకేషన్ కి వెళ్లారా? అన్నది స్పష్టత లేదు.