మణిపురి ఘర్షణల్లో తండ్రిని వెతికే చిన్నారి కథ
రాజ్ కుమార్ హిరాణీ, మీరా నాయర్, ఫర్హాన్ అక్తర్ వంటి సుప్రసిద్ధ దర్శకుల వద్ద సహాయ దర్శకురాలిగా పని చేసిన ప్రతిభావంతురాలు మణిపురి ఫిలింమేకర్ లక్ష్మీప్రియా దేవి.
రాజ్ కుమార్ హిరాణీ, మీరా నాయర్, ఫర్హాన్ అక్తర్ వంటి సుప్రసిద్ధ దర్శకుల వద్ద సహాయ దర్శకురాలిగా పని చేసిన ప్రతిభావంతురాలు మణిపురి ఫిలింమేకర్ లక్ష్మీప్రియా దేవి. లక్ష్య, లక్ బై ఛాన్స్, తలాష్ వంటి చిత్రాలకు అసిస్టెంట్. గత సంవత్సరం దహాద్ సిరీస్‌కి లక్ష్మీ ప్రియా పని చేసారు. పలు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లకు సహాయ దర్శకురాలిగా కొనసాగారు.
ఇప్పుడు లక్ష్మీ ప్రియా తన తొలి చిత్రం `బూంగ్` కారణంగా మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. ఎక్సెల్‌తో ఆమె అనుబంధం వల్ల ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ ఈ మణిపురి చిత్రాన్ని నిర్మించారు. బూంగ్ ఇప్పుడే టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్ కి వెళ్లడం ఉత్సాహం నింపుతోంది. ఈ సినిమా అన్ని వర్గాలను ఆకర్షిస్తుందని దర్శకురాలు చెబుతున్నారు.
బూంగ్ కథాంశం ఆసక్తికరం. ఒక ఒంటరి తల్లి చేతిలో పెరిగిన చిన్న పిల్లవాడికి సంబంధించిన ఒక మధురమైన కథ. తొలి చిత్ర నటుడు గుగన్ కిప్జెన్ కొంటె బాలుడుగా నటించాడు. తన తండ్రిని కనుగొనడానికి ఈ బాలుడు సాధ్యమైన ప్రతిదీ ప్రయత్నిస్తాడు. ప్రతి సంవత్సరం అతడు తన తండ్రి హోలీకి తిరిగి వస్తాడని, తన తల్లితో కలవాలని ఆశిస్తాడు. గొప్ప మణిపురి సంస్కృతి `బూంగ్`లో కనిపిస్తుంది.
ప్రస్తుత సంఘర్షణతో రాష్ట్రం నాశనమవుతున్న తీరును ఇందులో చూపిస్తున్నారు. మణిపురిలో ట్రాన్స్ సంస్కృతికి అందమైన నివాళి కూడా ఇందులో ఉంది. మణిపురి లో పరిస్థితులకు చలించిపోయి దర్శకురాలు ఈ నేపథ్యాన్ని ఎన్నుకున్నానని తెలిపారు. గత సంవత్సరం అల్లర్లకు ముందు మణిపూర్‌లో బయటి వ్యక్తులతో ఎలా ప్రవర్తించారో .. భారతదేశం-మయన్మార్ మధ్య సరిహద్దు పరిస్థితులు... మణిపూర్ వివాదం గురించి తెరపై చూపామని తెలిపారు. రిజర్వేషన్ల కారణంగా హింస మొదలైంది. అక్కడ కర్ఫ్యూ వాతావరణం ఉంది. కానీ ఆ పరిస్థితుల్లో సన్నివేశాలను చిత్రీకరించామని తెలిపారు. రితేష్, ఫర్హాన్ సహా పలువురికి నేను రాసుకున్న కథను చెప్పాను. వారంతా ఈ సినిమా చేద్దామని ప్రోత్సహించారని వెల్లడించారు. ఈ సినిమా రిలీజ్ తేదీ సహా ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.