SSMB29 లో థోర్ నటుడు? హీటెక్కించే హీరోయిన్‌లు!
ముఖ్యంగా పాన్ వరల్డ్ అప్పీల్ ఉన్న కథానాయికలను మాత్రమే అతడు ఎంపిక చేస్తున్నట్టు అర్థమవుతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్‌ల జాబితా అంతకంతకు పెరుగుతోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్‌ల విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉన్నారు. ముఖ్యంగా పాన్ వరల్డ్ అప్పీల్ ఉన్న కథానాయికలను మాత్రమే అతడు ఎంపిక చేస్తున్నట్టు అర్థమవుతోంది.
SSMB29 మార్కెట్ రేంజును బాహుబలి ఫ్రాంఛైజీ, ఆర్.ఆర్.ఆర్ ని మించి ఉండాలని రాజమౌళి తపిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం మేరకు.. ఈ సినిమాని చైనా సహా పరిసర దేశాల్లోను విజయవంతంగా ఆడించాలనే ప్రణాళిక అతడికి ఉంది. చైనాలో దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ ఫీట్ ని అందుకోవాలని అతడు కలలు కంటున్నాడు.
అందుకే ఇప్పుడు కథానాయికల ఎంపిక విషయంలో అతడి వ్యూహం విభిన్నంగా ఉందని భావిస్తున్నారు. ఈ సినిమాని హాలీవుడ్ రేంజులో తెరకెక్కిస్తున్నారు గనుక.. గ్లోబల్ స్థాయి హీరోయిన్ కావాలనుకున్నారు. అందుకే ఇటీవల ప్రియాంక చోప్రా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రియాంక చోప్రా యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్. అలాగే చాలా హాలీవుడ్ చిత్రాలు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. అందువల్ల మహేష్ సినిమా రేంజ్ అమాంతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రియాంక చోప్రా ఒక్కో సినిమాకి 30 కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటోంది. ఈ సినిమాలో మరో కథానాయికగా ఓ విదేశీ నటిని నటింపజేయాలని రాజమౌళి చూస్తున్నాడు. పోటీదారులలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ కూడా ఉన్నారు. అలాగే మలేషియా నటిని కూడా ఎంపిక చేస్తారని టాక్ వినిపిస్తోంది. కేవలం ప్రియాంక చోప్రా మాత్రమే కాదు... పలువురు హాలీవుడ్ నటీమణులు కూడా నటిస్తారని టాక్ వినిపిస్తోంది.
దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ రాసిన పుస్తకాల ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నామని గతంలో రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఈ సినిమా అడవి నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనుందని తెలిపారు. ఇండియానా జోన్స్ లైన్స్ లో భారతీయ ప్రేక్షకులకు కొత్త రకం ట్రీట్ ని అందిస్తుందని వెల్లడించారు.
థోర్ నటుడితో మంతనాలు:
ఇది మాత్రమే కాదు హాలీవుడ్ నుంచి దిగ్గజ కథానాయకులను కూడా ఎస్.ఎస్.ఎం.బి 29 కోసం బరిలో దించుతారని టాక్ వినిపిస్తోంది. `థోర్` ఫేం, హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ ని ఈ సినిమా కోసం ఒప్పించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను రాజమౌళి కానీ, అతడి బృందం కానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది.