తెలుగు ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ భరించలేం
నేను చాలా ఇబ్బంది పడ్డాను. పురుషాధిక్య ప్రపంచాన్ని తట్టుకోలేకపోయాను అని వ్యాఖ్యానించింది రాధిక ఆప్టే.
తెలుగు పరిశ్రమలో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. మహిళలను ట్రీట్ చేసే విధానం.. ఆన్ సెట్ నటీమణులను ట్రీట్ చేసే విధానం చాలా చెత్తగా ఉంటుంది. నేను చాలా ఇబ్బంది పడ్డాను. పురుషాధిక్య ప్రపంచాన్ని తట్టుకోలేకపోయాను అని వ్యాఖ్యానించింది రాధిక ఆప్టే. మరింతగా వివరాల్లోకి వెళితే..
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు- రాధికా ఆప్టే. రక్త చరిత్రలో నటించిన ఈ బ్యూటీ సూపర్ స్టార్ రజనీకాంత్ `కబాలి`లో, బాలకృష్ణ లెజెండ్ లోను నటించింది. పలు వెబ్ సిరీస్ లలో ఘాటైన నటనతోను మైమరిపించింది. తనదైన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అయితే రాధికా ఆప్టే స్త్రీ స్వేచ్ఛ, పురుషాధిక్యంపై స్వేచ్ఛగా మాట్లాడుతుంది. ఆమె ఎప్పుడూ హేతుబద్ధమైన విషయాలను ప్రస్థావిస్తూ.. మహిళా సంక్షేమం కోసం గొంతు విప్పే ధైర్యశీలి. బాహాటంగా మాట్లాడే వ్యక్తి కావడంతో వివాదాల్లోకి వస్తుంది.
తాజాగా రాధిక ఆప్టే త్రోబ్యాక్ ఇంటర్వ్యూ ఒకటి అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో తెలుగు చిత్ర పరిశ్రమపై రాధిక ఘాటు వ్యాఖ్యలు చేయడంతో అభిమానుల్లో ఫైర్ రాజుకుంది. ఆప్టే మాట్లాడుతూ, ``నేను చాలా కష్టపడ్డ పరిశ్రమ తెలుగు అని నేను అనుకుంటున్నాను. ఆ పరిశ్రమ చాలా పితృస్వామ్య పురుషాధిక్య పరిశ్రమ. ఇది భరించలేనిది. మహిళలను చూసే విధానం, సినిమాల్లో వారి పాత్రలు కూడా చాలా బలహీనంగా ఉంటాయి. సెట్‌లో మిమ్మల్ని మూడవ వ్యక్తిలా చూస్తారు. నటీనటులు ఇతరులను కూడా అడగకుండా వారి (హీరో దర్శకుడు) మానసిక స్థితి ఆధారంగా షూటింగ్‌ను రద్దు చేస్తారు. నేను నిరంతరం కష్టపడుతున్నాను.. నేను దానిని అంతం చేసాను. అప్పుడు అక్కడ నా కోసం అంతే అని నేను గ్రహించాను!`` అని ఆప్టే ఘాటైన వ్యాఖ్యలు చేసారు. దీంతో సోషల్ మీడియాలో టాలీవుడ్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.
రాధిక ఆప్టే కొన్నేళ్ల క్రితం రాజీవ్ మసంద్ తో ఇంటర్వ్యూలో ఈ విషయాలు మాట్లాడింది. వాటిపై అప్పట్లో బోలెడంత చర్చ సాగింది. కానీ మళ్లీ ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ క్లిప్ ని షేర్ చేయడానికి కారణమేమిటి? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో శృంగార చిత్రాల్లో పచ్చిగా నటించిన రాధికా ఆప్టే తెలుగు పరిశ్రమ గురించి మాట్లాడటమా? అంటూ కొందరు దుయ్యబట్టారు. రాధిక వలువలు లేకుండా నటించిన కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ తనను తిట్టడం కనిపిస్తోంది.