మెగాస్టార్ గారు.. 71లో ఇదేమి స్పీడ్ సార్!

ఏడు పదుల వయసు.. అయినా తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు పాన్ ఇండియా హీరో, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి

Update: 2024-04-17 14:30 GMT

ఏడు పదుల వయసు.. అయినా తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు పాన్ ఇండియా హీరో, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ అలరిస్తున్నారు. 71 ఏళ్ల వయసులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడమే కాకుండా హిట్లు కూడా అందుకుంటూ యంగ్ యాక్టర్లలో మరింత స్పూర్తిని నింపుతున్నారు. గత ఏడు నెలల్లో ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మమ్ముట్టి.

ఇప్ప‌టివ‌ర‌కు మూడు నేష‌న‌ల్ అవార్డుల‌ను అందుకున్న మ‌మ్ముట్టి.. ఇటీవల కన్నూర్ స్క్వాడ్, భ్రమయుగం, కాతల్, అబ్ర‌హం ఓజ్ల‌ర్ తో థియేటర్లలో సందడి చేశారు. త్వరలోనే ఆయన నటిస్తున్న టర్బో మూవీ రిలీజ్ అవ్వనుంది. జూన్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఆ సమయంలో మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో జీపుపై రాజసం ఉట్టిపడేలా పోజు ఇచ్చారు మమ్ముట్టి.

అయితే క‌న్నూర్ స్క్వాడ్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 100 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఆ సినిమాలో నిజాయితీప‌రుడైన పోలీస్ ఆఫీస‌ర్‌ గా మ‌మ్ముట్టి న‌టించారు. లేటెస్ట్ మూవీ భ్ర‌మ‌యుగంలో నెగెటివ్ షేడ్స్‌ తో కూడిన మాంత్రికుడి పాత్ర‌లో తన యాక్టింగ్ తో అదరగొట్టారు. రోషాక్‌, పురు, అబ్ర‌హం ఓజ్ల‌ర్ సినిమాల్లో మ‌మ్ముట్టి విల‌న్‌ గా యాక్ట్ చేశారు. కాథ‌ల్ ది కోర్ మూవీలో హోమో సెక్సువ‌ల్ క్యారెక్ట‌ర్ చేసి అందరినీ అబ్బురపరిచారు.

ఈ మ‌ల‌యాళం సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వద్ద క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ లుగా నిలిచిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఇటీవల యాత్ర -2 సినిమాలో మమ్ముట్టి కనిపించారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి దివంగత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి పాత్ర‌లో యాక్ట్ చేశారు. మ‌ల‌యాళంలో మాత్ర‌మే కాకుండా త‌మిళం, తెలుగు భాష‌ల్లో కూడా ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.

గ‌త కొన్నాళ్లుగా పాత్ర‌ల ప‌రంగా వైవిధ్య‌త‌కు ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మ‌మ్ముట్టి. అయితే చాలా మంది నటులు.. కెరీర్ లోని ఈ దశలో సేఫ్ జోన్ లో ఉన్న పాత్రలే ఎంచుకుంటారు. కానీ మమ్ముట్టి మాత్రం ఛాలెంజింగ్ రోల్స్ చేస్తున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ యువ నటులకు సవాల్ విసురుతున్నారు. ఆడియన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. మరి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి చిత్రాలు చేస్తారో, ఎన్ని రికార్డులు సృష్టిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News