మంచు లక్ష్మికీ ఉన్నాడు.. కాళ్ల మీద పడే ఫ్యాన్

కొన్ని ఈవెంట్లలో ఈ దృశ్యాలు సహజంగా అనిపించినా.. రేంజ్ లేని కొందరు స్టార్ల కోసం అభిమానులు ఇలాంటి పనులు చేసి సందేహాలు రేకెత్తిస్తుంటారు.

Update: 2024-03-19 17:33 GMT

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ఈవెంట్లు జరుగుతుంటే అక్కడ ఫ్యాన్స్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. కొందరు స్టార్లకు రియల్‌గానే క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లు ఈవెంట్లలో నానా హంగామా చేస్తారు. కానీ కొందరు హీరోలు మాత్రం తమకు బాగా క్రేజ్ ఉందని చాటుకోవడానికి ఫ్యాన్ క్లబ్స్ మెయింటైన్ చేసి సినిమా ఈవెంట్లలో కృత్రిమమైన రచ్చ జరిగేలా చేస్తుంటారు. ఈవెంట్లలో పనిగట్టుకుని కొందరు అభిమానులు స్టేజ్ మీదికి వచ్చేసి హీరోల కాళ్ల మీద పడిపోవడం.. హగ్ చేసుకోవడానికి ప్రయత్నించడం.. చాలా ఎమోషనల్ అయిపోవడం.. లాంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. కొన్ని ఈవెంట్లలో ఈ దృశ్యాలు సహజంగా అనిపించినా.. రేంజ్ లేని కొందరు స్టార్ల కోసం అభిమానులు ఇలాంటి పనులు చేసి సందేహాలు రేకెత్తిస్తుంటారు.

ఇలాంటి పరిణామాలు జరిగినపుడు సోషల్ మీడియా ట్రోలింగ్ కూడా గట్టిగానే జరుగుతుంటుంది. ఇదంతా స్క్రిప్టెడ్ అనే విషయాన్ని ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు మంచు లక్ష్మి కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంటోంది. మంచు ఫ్యామిలీకి ట్రోలింగ్ కొత్త కాదు. మంచు లక్ష్మి అసలు ట్రోలింగ్‌తోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. దీన్ని ఆమె స్పోర్టివ్‌గానే తీసుకుంటుంటుంది ఎప్పుడూ. తాజాగా మంచు లక్ష్మి లీడ్ రోల్ చేసిన ‘ఆదిపర్వం’ మూవీకి సంబంధించి ఒక ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది. ఆ వేడుకలో మంచు లక్ష్మి వేదిక మీద మాట్లాడుతుండగా.. ఒక అభిమాని అక్కడికి దూసుకొచ్చాడు. మంచు లక్ష్మి కాళ్ల మీద పడిపోయాడు. అతణ్ని ఆపి అక్కడి నుంచి పంపించిన లక్ష్మి.. తర్వాత అతణ్ని పిలిపించి ఫొటో దిగింది. ఆ అభిమాని దాదాపు కన్నీళ్లు పెట్టుకునేంత ఎమోషనల్ అయిపోయాడు. మంచు లక్ష్మికి కూడా కాళ్ల మీద పడే అభిమానులున్నారంటూ ఆమెను ఎప్పట్లాగే ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. కానీ లక్ష్మి ఇలాంటివి తేలిగ్గానే తీసుకుంటుందని వేరే చెప్పాలా?

Tags:    

Similar News