పబ్లిక్ టాక్: 'మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా!'
మరి ఈ చిత్రం ఎలా ఉంది?అభినవ్ హీరోగా చేసిన ప్రయత్నం మెప్పించిందా లేదా?ఈ సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం
ఇటీవల కాలంలో కమెడియన్లు హీరోలుగా అలరిస్తున్న నేపథ్యంలో, టాలీవుడ్ కమెడియన్ అభినవ్ గోమటం ఇప్పుడు 'మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా' అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తిరుపతి రావు ఇడ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ గెస్ట్ రోల్ లో మెరిశాడు. వరుణ్ తేజ్, నిఖిల్ లాంటి యువ హీరోలు ప్రమోషన్స్ లో భాగం అవడంతో అందరి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా.. ఈ రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది?అభినవ్ హీరోగా చేసిన ప్రయత్నం మెప్పించిందా లేదా?ఈ సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కథేంటంటే.. చిన్నప్పట్నుంచి బ్యాడ్ లక్ వెంటాడే యువకుడు మనోహర్(అభినవ్ గోమటం).. తన తండ్రి బాటలో పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. దాన్ని అందరూ చిన్న చూపు చూస్తుంటారు. చివరకి అతను చేసే పని నచ్చక అతను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి, ప్రేమించిన వాడితో లేచిపోతుంది. దీంతో లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి ఏదైనా చెయ్యాలని ఫిక్స్ అయిన మనోహర్.. ఫ్లెక్స్ డిజైనింగ్ షాప్ పెట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. ఆ తరువాత ఏం జరిగింది? మనోహర్ విజయం సాధించాడా లేదా? ఉమాదేవి(వైశాలి రాజ్)తో తన లవ్ ఎలాంటి మలుపులు తిరిగింది? అతనికీ రాహుల్ (అలీ రెజా) మధ్య వైరం ఏంటి?, చివరికి అతని కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంది? అనేది మిగిలిన కథ.
'మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా' చాలా సింపుల్ కథ. ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ పెట్టి లైఫ్‌లో సక్సెస్ అవ్వాలనుకున్న ఒక పెయింటర్.. అప్పుడైనా తనకు గౌరవంగా అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు వస్తారని భావిస్తాడు. అందుకోసం అతడు పడే స్ట్రగుల్ ఏంటి?, మధ్యలో లవ్ ఏంటనేదే ఈ సినిమా. ఇది హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఎంచుకునే బలమైన కథ కాదు, అలా అని అభినవ్ బలమైన కామెడీతో కూడిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కూడా కాదు. ఒక చిన్న పాయింట్ తీసుకొని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్రయత్నంలో వచ్చిన కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అని తెలుస్తోంది.
స్టార్టింగ్ నుంచీ స్టోరీ చాలా లైటర్ ఎమోషన్స్ తో, రొటీన్ సీన్లతో సాగుతుంది. హీరో ప్రింటింగ్ ప్రెస్ పెట్టాలనుకోవడం, ఫోటో షాప్ నేర్చుకోవాలనుకోవడం, అక్కడ హీరోయిన్ తో పరిచయం వంటి సన్నివేశాలు రెగ్యూలర్‌గానే ఉన్నాయి. ఫస్టాప్ మొత్తం ఇలాంటి సీన్స్ తోనే నడుస్తుంది. అయితే ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక సెకండాఫ్ లో మెయిన్ ప్లాట్ ను డీల్ చేసిన విధానం మెప్పిస్తుంది. మధ్యలో జనరేట్ అయ్యే ఫన్ కూడా నవ్విస్తుంది. కాకపోతే చాలా లాజిక్స్ ని వదిలేశారు. కానీ ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఏం జరగబోతోందో అనే ఉత్కంఠ కలుగుతుంది.. క్లైమాక్స్ వరకూ ఆసక్తికరంగా సాగుతుంది.
మనోహర్ పాత్రలో అభినవ్ గోమటం మెప్పించాడు. ఎమోషన్స్ ని బాగా పండించాడు కానీ, తన మార్క్ కామెడీ మాత్రం మిస్ అయ్యింది. హీరోయిన్ వైశాలి రాజ్ క్యూట్ గా అలరిస్తుంది. కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో అలీ రెజా, హీరో ఫ్రెండ్ పాత్రలో మోయిన్ ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్ర మేరకు మెప్పించారు. టెక్నికల్ విషయానికొస్తే.. సంజీవ్ సారథ్యంలో సిద్ శ్రీరామ్ పాడిన పాట అలరిస్తుంది. దర్శకుడు తిరుపతి రావు బలమైన కథ ఎంచుకోనప్పటికీ, టేకింగ్ పరంగా ఫర్వాలేదనిపించుకున్నాడు. ఓవరాల్ గా 'మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా' ఒక టైమ్ పాస్ మూవీ అని పబ్లిక్ టాక్ ను బట్టి తెలుస్తోంది.