కీరవాణి క్లాసీ ట్యూన్‌తో 'చంద్రముఖి' ఘనమైన ఆహ్వానం
ఆస్కార్ స్వరాన్ని సృజించిన పాపులర్ సంగీత దర్శకుడు MM కీరవాణి స్వరపరిచిన ట్యూన్ ఎంతో మెస్మరైజ్ చేస్తోంది
చంద్రముఖిని ఇంత ఘనంగా ఆహ్వానిస్తే ఊరుకుంటుందా? .. ఊపిరి బిగబట్టే హారర్ టెర్రర్ తో ఒణికించదూ? నిజానికి ఇలాంటి సందేహం కలుగుతోంది ఈ ఫ్రాంఛైజీ అభిమానుల్లో. రజనీకాంత్ కథానాయకుడిగా జ్యోతిక కీలక పాత్రలో పి.వాసు తెరకెక్కించిన చంద్రముఖి ఎలాంటి విజయం అందుకుందో తెలిసిందే. చాలా కాలానికి ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది అనగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. చంద్రముఖి 2లో క్వీన్ కంగన రనౌత్ నటిస్తోంది అనగానే మరింత ఉత్కంఠ పెరిగింది. దిగ్గజాల కలయికలో రూపొందుతున్న చిత్రమిది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే ఎక్కడా రాజీకి రాకుండా లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆస్కార్ స్వరాన్ని సృజించిన పాపులర్ సంగీత దర్శకుడు MM కీరవాణి స్వరపరిచిన ట్యూన్ ఎంతో మెస్మరైజ్ చేస్తోంది.
నిజానికి చంద్రముఖికి ఘనమైన ఆహ్వానమిదని చెప్పేలా బాణి కుదిరింది. ఇది క్లాసిక్ ట్యూన్ అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. లాస్య విలసిత నవనాట్య దేవతా.. నటనాంకిత అభినయవత......చరితా.. స్వాగతాంజలి అంటూ సాగే ట్యూన్ ఎంతో ఆకట్టుకుంది.
టీజర్ ఆద్యంతం శాస్త్రీయ సంగీత ధ్వనులు.. చక్కని తెలుగు సాహిత్యంతో ఎంతో ఆకట్టుకుంది. శ్రీనిధి తిరుమల ఈ పాటను ఆలపించారు. చంద్రముఖి 2లో కంగనా రనౌత్ తో పాటు రాఘవ లారెన్స్ లాంటి పెర్ఫామర్ యాడవ్వడంతో ఇప్పుడు 'ఫైర్ యాడెడ్ టుది పెట్రోల్' అన్న చందంగా ఆసక్తి మరింత పెరిగింది.
హారర్ కామెడీ జానర్ లో రూపొందుతున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్ ని థియేటర్లకు రప్పిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం గణేష్ చతుర్థి సందర్భంగా తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.