స్ట్రెయిట్ వెర్సస్ డబ్బింగ్.. గెలిచేదెవరో?
సంక్రాంతికి భారీ బాక్సాఫీస్ క్లాష్ చూశాం. ఆ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌లో చెప్పుకోదగ్గ క్లాష్ లేదు.;
సంక్రాంతికి భారీ బాక్సాఫీస్ క్లాష్ చూశాం. ఆ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌లో చెప్పుకోదగ్గ క్లాష్ లేదు. చాలా సినిమాలు రిలీజైనా కూడా.. బాక్సాఫీస్ దగ్గర హోరాహోరీ పోరు అయితే కనిపించలేదు. కానీ వేసవి సీజన్‌కు ఆరంభాన్నిస్తూ ఈ నెల చివరి వారంలో పోటీకి ఆసక్తికర చిత్రాలు సై అంటున్నాయి. రేసులో ఉన్న నాలుగు చిత్రాలూ క్రేజీగానే కనిపిస్తున్నాయి. అందులో రెండు స్ట్రెయిట్ చిత్రాలు కాగా.. రెండేమో డబ్బింగ్‌వి. కానీ అన్నింట్లోనూ బలమైన కంటెంట్ ఉన్నట్లే కనిపిస్తోంది.
మార్చి చివరి వారం బరిలో ఉన్న వాటిలో హైయెస్ట్ బజ్ ఉన్న చిత్రం అంటే.. 'రాబిన్ హుడ్'యే. 'భీష్మ' తర్వాత వెంకీ కుడుముల, నితిన్ కలిసి చేసిన సినిమా ఇది. మొదలైనపుడే మంచి బజ్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు హైప్ ఇంకా పెరిగింది. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే ధీమా చిత్ర బృందంలో కనిపిస్తోంది. ప్రమోషన్లు కూడా హోరెత్తించేస్తున్నారు. ఈ చిత్రం రిలీజవుతున్న మార్చి 28నే మరో క్రేజీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' కూడా విడుదలవుతోంది. 'మ్యాడ్' సూపర్ హిట్టయిన నేపథ్యంలో దాని సీక్వెల్ యూత్‌లో మంచి బజ్ క్రియేట్ చేసింది.
గత నెలలో వచ్చిన టీజర్ అంచనాలకు తగ్గట్లే ఉండడంతో హైప్ ఇంకా పెరిగింది. కానీ తర్వాత కొన్ని వారాలు సినిమా వార్తల్లో లేదు. ప్రమోషన్లలో కూడా కొంచెం వెనుకబడింది. ఒక దశలో రిలీజ్ డౌట్ అన్నారు. కానీ ఇప్పుడు మార్చి 28కే కట్టుబడి ఉన్నారు. రిలీజ్ ముంగిట వారం రోజులు ప్రమోషన్ల జోరు పెంచనున్నారు.
తెలుగులో ఇలా రెండు క్రేజీ చిత్రాలు వస్తుంటే.. పోటీలో ఉన్న డబ్బింగ్ చిత్రాలు కూడా తక్కువేమీ కాదు. మోహన్ లాల్ మూవీ 'ఎల్-2: ఎంపురన్' ట్రైలర్లో భారీతనానికి లోటు లేదు. ఒక సూపర్ స్టార్ సినిమా కళ అందులో స్పష్టంగా కనిపించింది. ఇది బ్లాక్ బస్టర్ మూవీ 'లూసిఫర్'కు సీక్వెల్ కావడం విశేషం. మరోవైపు మంచి కమర్షియల్ హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా సాగుతున్న తమిళ స్టార్ విక్రమ్ నిరీక్షణకు 'వీర ధీర శూర-2' తెరదించేలాగే కనిపిస్తోంది. ఈ సినిమా ప్రోమోలు కూడా క్రేజీగా అనిపిస్తున్నాయి. ఇలా మొత్తంగా మార్చి చివరి వారం బరిలో ఉన్న ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకంగా, ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. మరి స్ట్రెయిట్ వెర్సస్ డబ్బింగ్ పోటీలో గెలిచేదెవరో చూడాలి.