'పుష్ప 2' రిలీజ్.. సినిమాని ఆదరించాలంటూ నాగబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్!

అయితే ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు పెట్టిన ఓ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Update: 2024-12-04 14:48 GMT

యావత్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన "పుష్ప 2: ది రూల్" సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈరోజు రాత్రి ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇక బన్నీ సినిమాకి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా లేదా? అనే చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 'పుష్ప 2'కి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసాడు. అయితే ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు పెట్టిన ఓ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

"24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో, వేల‌ మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే 'సినిమా'. ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.. అందరిని అలరించే సినిమాని సినిమాలానే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను" అని నాగబాబు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇక్కడ మెగా బ్రదర్ సినిమా పేరు ప్రస్తావించనప్పటికీ, 'పుష్ప 2' గురించే ఈ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారని నెటిజన్లు భావిస్తున్నారు.

ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు వెళ్లిన తర్వాత, "మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే'' అంటూ నాగబాబు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి డిలీట్ చేయడం పెద్ద దుమారం రేపింది. ఒక విధంగా ఈ వ్యాఖ్యలే బన్నీని జనసైనికులు విపరీతంగా ట్రోల్ చేయడానికి కారణమని చెప్పాలి. అప్పటి నుంచి పరోక్షంగా ఏదొక ట్వీట్ పెడుతూ వస్తున్న నాగబాబు.. ఇప్పుడు ఇండైరెక్ట్ గానే 'పుష్ప 2' సినిమాకి సపోర్టుగా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

అల్లు, మెగా కుటుంబాల మధ్య విభేదాలు నెలకొన్నాయని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే ఇన్నాళ్ళూ మెగా హీరోలేవరూ 'పుష్ప 2' గురించి ఎవరూ పోస్టులు పెట్టకపోవడంతో, అందరూ ఈ సినిమాకు దూరంగా ఉంటారేమో అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే అల్లు అర్జున్ కి బెస్ట్ విషెస్ అందజేస్తూ సాయి దుర్గ తేజ్ పోస్ట్ పెట్టారు. దీనికి బన్నీ స్పందిస్తూ "థ్యాంక్యూ వెరీ మచ్ తేజు. మీ సోదర శుభాకాంక్షలకు ధన్యవాదాలు. నీకు ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు.

రామ్ చరణ్ నటిస్తున్న 'RC 16' టీమ్ నుంచి కూడా 'పుష్ప' సీక్వెల్ కు విషెస్ వచ్చాయి. "ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ తో సహా 'పుష్ప 2: ది రూల్' టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు. ఈరోజు రాత్రికి ప్రారంభమయ్యే ప్రీమియర్ షోలకు, రేపు గ్రాండ్ రిలీజ్ కు ఆల్ ది వెరీ బెస్ట్! భారీ బ్లాక్ బస్టర్ కోసం సిద్ధంగా ఉండండి!" అని RC16 మేకర్స్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దర్శకుడు బుచ్చిబాబు 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ గురించి ఎందుకు మాట్లాడలేదని అంటుకుంటున్న టైంలో, ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా టీమ్ నుంచి ఈ ట్వీట్ రావడం గమనార్హం.

ఏదేమైనా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అల్లు Vs మెగా అనే విధంగా ఫ్యాన్ వార్స్ జరుగుతుండగా.. "పుష్ప 2" చిత్రానికి సపోర్టుగా మెగా ఫ్యామిలీ నుంచి ట్వీట్స్ రావడం ఆసక్తికరంగా మారింది. ఇరు వర్గాల మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా, ఈ సినిమాతో అన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ దెబ్బతో అభిమానులంతా ఏక తాటి మీదకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో!.

Tags:    

Similar News