బావ హీరో.. బావమరిది ప్రొడ్యూసర్..

అయితే కొంతకాలంగా ప్రొడక్షన్ పైనే ఎక్కువగా తన ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నారు మన హల్క్.

Update: 2024-10-21 13:30 GMT

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి.. ప్రస్తుతం కాంత మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఆ మూవీ.. మల్టీస్టారర్ గా తెరకెక్కుతోంది. అదే సమయంలో రానా నాయుడు-2 వెబ్ సిరీస్ షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నారు. చివరగా విరాటపర్వం మూవీతో హీరోగా అలరించిన రానా.. ఇప్పటి వరకు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. గత ఏడాది రాక్షస రాజా సినిమాను అనౌన్స్ చేసినా.. దానిని పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.


అయితే కొంతకాలంగా ప్రొడక్షన్ పైనే ఎక్కువగా తన ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నారు మన హల్క్. రీసెంట్ గా 35-ఇది చిన్న కథ కాదు మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ జిగ్రా మూవీని తెలుగులో రిలీజ్ చేశారు. ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో భాగమవుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మూవీకి రానా నిర్మాతగా మారనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తాను హీరోగా కాకుండా యువ సామ్రాట్, తన బావ నాగచైతన్యను నటించమని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలకు రచయితగా పనిచేసిన కిషోర్.. కొన్ని నెలల క్రితం రానాకు హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో రాసుకున్న స్టోరీని నెరేట్ చేశారట. కథ నచ్చి రానా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, నవంబర్ లో షూటింగ్ స్టార్ అవుతుందని అప్పట్లో టాక్ వచ్చింది.

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్‌ ను రూపొందించిన ఆర్కా మీడియా వర్క్స్ ఆ సినిమాను నిర్మించేందుకు సిద్ధమైంది. అయితే ఇప్పుడు ఆ మూవీ రానా కోరిక మేరకు.. నాగచైతన్య చేతిలోకి వెళ్లిందట. చైతూకు కూడా స్క్రిప్ట్ నచ్చడంతో ఆయన ఓకే చెప్పారని తెలుస్తోంది. ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్న ఆయన.. త్వరలో డేట్స్ ఇవ్వనున్నారని సమాచారం. మరికొద్ది రోజుల్లో షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారని ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే కొత్త దర్శకుడు కిషోర్.. ప్రస్తుతం చైతూ ఇమేజ్ కు తగ్గట్టు స్టోరీలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు హీరోయిన్ గా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని అనుకోగా.. ఇప్పుడు మరో ముద్దుగుమ్మని సెలెక్ట్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే అన్ని వివరాలు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని వినికిడి. మరి చైతూ హీరోగా, ఆర్కా మీడియా వర్క్స్‌ తో పాటు రానా కోప్రొడ్యూసర్‌ గా.. రూపొందనున్న ఆ మూవీ.. ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News