ఆ యంగ్ హీరో మామ్ నిర్మాత అవ్వడానికి కారణం!
యంగ్ హీరో నాగశౌర్య మామ్ ఉషా మూల్పూరి గురించి పరిచయం అవసరం లేదు.
యంగ్ హీరో నాగశౌర్య మామ్ ఉషా మూల్పూరి గురించి పరిచయం అవసరం లేదు. నాగశౌర్య కంటే ఉష సోషల్ మీడియాలో మరింత పాపులర్. `ఛలో` సినిమాతో ఐరా క్రియేషన్స్ సంస్థను స్థాపించి ఉష నిర్మాతగా పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే నిర్మాతగా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ సినిమాతో నాగశౌర్య కెరీర్ ని కొత్త మలుపు తిప్పింది. అప్పటికే వరుస ప్లాప్ లతో ఉన్న హీరోకి అవకాశాలు తగ్గిన సమయంలో నేరుగా సొంత నిర్మాణ సంస్థనే స్థాపించి సంచలనం సృష్టించారు.
ఆ సంస్థ తొలి సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ వరకూ ఎక్కడా రాజీ పడలేదు. తాజాగా ఆ సంస్థ ప్రారంభించడానికి గల కారణాలు? ఎలాంటి పరిస్థితుల్లో ఐరా క్రియేషన్స్ లాంచ్ అయిందో ఉష రివీల్ చేసారు. అవి ఏంటో ఆమె మాటల్లోనే..`చిన్నప్పుడు నాగశౌర్య పెద్దగా చదువుకునేవాడు కాదు. అందువలన నేను కొట్టేదాన్ని. నాగశౌర్య హీరోగా ట్రై చేస్తానని అంటే వద్దనే అన్నాను. కానీ ఆ తరువాత సరే అనాల్సి వచ్చింది. నాగశౌర్య హీరోగా తనంతట తానుగా కష్టపడుతూ అవకాశాలు తెచ్చుకున్నాడు.
అందులో మా ప్రమేయమేమీ లేదు. ఏ రోజున కూడా మేము నిర్మాతలుగా మారాలని అనుకోలేదు. కొన్ని కారణాల వలన అలా మారవలసి వచ్చింది. నాగశౌర్య `ఛలో` సినిమా చేయాలనుకున్నాడు. నిర్మాత కోసం వెతుకుతున్నాడు. తనకి పారితోషికం ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పి ఒక నిర్మాతను ఒప్పించడానికి నాగశౌర్య ప్రయత్నించాడు.ఆ విషయాన్ని నాగశౌర్య నాకు చెప్పినప్పుడు చాలా బాధగా అనిపించింది. అవసరం లేదు ఆ సినిమా మనమే చేద్దామని చెప్పాను.
అప్పటికి సినిమా బిజినెస్ గురించి మాకు ఏమీ తెలియదు. ఆ సినిమాను చేశాము . పెద్ద హిట్ అయింది. అయినా మాకు డబ్బులు రాలేదు. డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు. కానీ అదే సంస్థలో నిర్మించిన `నర్తనశాల` సినిమా ప్లాప్ అవ్వగానే ఉదయాన్నే వచ్చి ఆఫీస్ దగ్గర కూర్చున్నారు. అప్పుడే అర్ధమైంది ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుందని` అని అన్నారు. ప్రస్తుతం నాగశౌర్య హీరోగా `పోలీస్ వారి హెచ్చరిక` సినిమాతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.