శ్రీవారి సేవలో నాని అండ్ ఫ్యామిలీ

నేచురల్ స్టార్ నాని వచ్చే వారం సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Update: 2024-08-24 05:45 GMT

నేచురల్ స్టార్ నాని వచ్చే వారం సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌ గా నటించింది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు గత వారం రోజులుగా నాని విరామం లేకుండా పాల్గొంటున్నాడు. నేడు నాని ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలి నడకన మెట్లు మార్గం ద్వారా తిరుమల చేరుకున్న నాని ఫ్యామిలీ స్వామి వారిని దర్శించుకున్నారు.

నాని, అంజన దంపతులతో పాటు వారి తనయుడు అర్జున్‌ ఇంకా సరిపోదా శనివారం సినిమా హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌ కూడా కాలి నడకన తిరుమల చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. నడక మార్గంలో నాని వెళ్తూ ఉండగా పలువురు అభిమానులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. నాని కూడా తనను కలిసిన వారితో మాట్లాడుతూ తిరుమల చేరుకున్నారు. నానితో ఫ్యాన్స్ దిగిన ఫోటోలు మరియు వీడయోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నాని ఫ్యామిలీని కవర్‌ చేసేందుకు మీడియా ఫోటోగ్రాఫర్‌ లు పోటీ పడ్డారు.

నాని సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో వచ్చిన హాయ్‌ నాన్న మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రతి సినిమా మినిమం గ్యారెంటీ అన్నట్లుగా వసూళ్లు సాధిస్తున్నాయి. సరిపోదా శనివారం మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. నాని కెరీర్‌ లోనే అత్యంత భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాను నిర్మించినట్లు తెలుస్తోంది. వంద కోట్లకు పైగా ఖర్చు చేశారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మీడియా సర్కిల్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా పై అంచనాలు ఇంకా ఆసక్తి పెరుగుతోంది.

ఈ సినిమాకు ముందు నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో అంటే సుందరానికి సినిమా వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. నాని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అంటే సుందరానికి సినిమా విషయంలో తాము చేసిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని ఒక మంచి కమర్షియల్‌ మూవీగా సరిపోదా శనివారం రూపొందించినట్లుగా చెప్పుకొచ్చాడు. అంటే సుందరానికి సినిమా నిరాశ పరచడంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ పాత్ర కంటే తన పాత్ర ఎక్కువ అన్నట్లుగా ఫ్లాప్‌ ను తనపై వేసుకున్నాడు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్‌ కొట్టగలను అనే నమ్మకంతో నాని కనిపిస్తున్నాడు.

Tags:    

Similar News