చ‌ర‌ణ్ Vs ఎన్టీఆర్ Vs బ‌న్ని: ఎవ‌రు జాతీయ ఉత్త‌మ న‌టుడు?

తాజా క‌థ‌నాల ప్ర‌కారం.. సౌత్ నుంచి ఉత్తమ నటుడి రేసులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సూర్య, ధ‌నుష్‌ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి

Update: 2023-08-24 08:30 GMT

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్ర‌క‌ట‌న‌కు స‌మ‌య‌మాస‌న్న‌మైంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు న్యూ ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ప్రెస్ మీట్‌లో విజేతలను ప్రకటిస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాలు నటీనటులు స‌హా సాంకేతిక వ‌ర్గాల్లో అవార్డులు గెలుచుకునేందుకు పోటీప‌డుతున్న వారి జాబితా సోషల్ మీడియాల్లో రివీల‌య్యాయి. ఈసారి చాలా మంది పోటీబ‌రిలో ఉన్నారు. సౌత్ స‌హా బాలీవుడ్ నుంచి ప‌లువురు స్టార్లు రేసులో ఉన్నారు. ప‌లు సినిమాల మధ్య గట్టి పోటీ నెల‌కొంద‌ని తెలుస్తోంది.

తాజా క‌థ‌నాల ప్ర‌కారం.. సౌత్ నుంచి ఉత్తమ నటుడి రేసులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సూర్య, ధ‌నుష్‌ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. RRR, పుష్ప: ది రైజ్, జై భీమ్, నాయట్టు, మిన్నల్ మురళి స‌హా అనేక ఇతర సినిమాలు పోటీబ‌రిలో ఉన్నాయి. విజేతలను ఈరోజు ప్రకటించనున్నారు. RRR న‌టులు రామ్ చ‌ర‌ణ్ లేదా ఎన్టీఆర్ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రికి ఉత్త‌మ న‌టుడు పుర‌స్కారం ద‌క్కేందుకు ఛాన్సుంద‌ని ఊహిస్తున్నారు. మ‌రోవైపు ఐకాన్ స్టార్ సైతం ఉత్త‌మ న‌టుడు పుర‌స్కారానికి అర్హుడ‌ని అభిమానులు బ‌లంగా న‌మ్ముతున్నారు. కర్ణన్ చిత్రంలో నటనకు ధనుష్ జాతీయ అవార్డును అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

జాతీయ అవార్డుల రేసులో ఉత్తమ సినిమాలు, ఉత్తమ నటులు, ఉత్తమ నటీమణుల జాబితా ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఉత్తమ నటుడి రేసులో RRR నుంచి రామ్ చ‌ర‌ణ్ , జూనియర్ ఎన్టీఆర్ బ‌రిలో నిల‌వ‌గా.. పుష్ప: ది రైజ్ తో సంచ‌ల‌నం సృష్టించిన అల్లు అర్జున్ కూడా ఈసారి రేసులో నిల‌వ‌నున్నాడు. జై భీమ్ - సూర్య, కర్ణన్ - ధనుష్ పోటీబ‌రిలో ఉన్నారు. సిలంబరసన్ TR -మానాడు, ఆర్య- సర్పత్తా, నటుడు జోజు జార్జ్ నయట్టు కూడా ఉత్త‌మ న‌టుడు రేసులో ఉన్నారు. ఉత్తమ నటి అవార్డు రేసులో ఆలియా భట్ (గూబాయి కతియావాడి).. కంగనా రనౌత్ (తలైవి) రేసులో ఉన్నారు. జై భీమ్‌లో గర్భిణిగా నటించిన లిజో మోల్ .. భూతకాలం చిత్రంలో న‌టించిన‌ రేవతి పోటీబ‌రిలో ఉన్నారు.

నేషనల్‌ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం కోసం పోటీకి దిగుతున్న సినిమాల జాబితా ప‌రిశీలిస్తే.. టాలీవుడ్ నుంచి RRR, పుష్ప: ది రైజ్, ఉప్పెన, జాతి రత్నాలు, ఉప్పెన ఇతర తెలుగు సినిమాలు జాబితాలో ఉన్న‌ట్టు తెలిసింది. తమిళ చిత్రాలు- జై భీమ్, కర్ణన్, సర్పత్త పరంబరై, వినోదయ సీతం, మానాడు బ‌రిలో ఉన్నాయి. నయట్టు, మిన్నల్ మురళి, మెప్పడియాన్ వంటి అనేక మలయాళ చిత్రాలు గౌరవనీయమైన అవార్డుల కోసం బలమైన పోటీనివ్వ‌నున్నాయి. మాధవన్ దర్శకత్వం వహించిన రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ మరొక బలమైన పోటీదారుగా నిల‌వ‌నుంది. ఈసారి ఆర్.ఆర్.ఆర్ సంగీత ద‌ర్శ‌కుడు ఆస్కార్ గెలిచినందున జాతీయ ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా పుర‌స్కారం నెగ్గేందుకు ఆస్కారం ఉంద‌ని కూడా తెలుస్తోంది.

Tags:    

Similar News