డబ్బు వెంటపడకు.. అదే నీ వెంట పడాలి!
మనం ఎప్పుడూ డబ్బు వెంట పడకూడదు.. అదే మన వెంట పడాలి. అలా చేయాలంటే మనం మన పనిని సవ్యంగా చేయాలి.;
మనం ఎప్పుడూ డబ్బు వెంట పడకూడదు.. అదే మన వెంట పడాలి. అలా చేయాలంటే మనం మన పనిని సవ్యంగా చేయాలి. మంచి పని ఏమిటో తెలుసుకుని దాని వెంట పడాలి! అని అన్నారు సీనియర్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి. నటీనటులు భారీగా సంపాదిస్తుంటారు కదా? మీరు కూడా నిర్మాతల నుంచి పెద్ద మొత్తాలను దండుకుంటారా? అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. అంతేకాదు ఆర్టిస్టులు డిమాండ్ చేయడం మొదలు పెడితే అవకాశాలు తగ్గిపోతాయని కూడా అన్నాడు. తమ ప్రతిభను బట్టి ఇండస్ట్రీ ఎంత ఇవ్వాలో నిర్ణయిస్తుందని క్లారిటీనిచ్చారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇటీవల పరిశ్రమలోని నటీనటుల ఆదాయ ఆర్జనలపై అంతర్గత విషయాలను బయటికి చెప్పారు. ఎక్కువ వేతనం కోసం తాను డిమాండ్ చేయడం లేదని, అయితే ప్రతి చిత్రానికి నటీనటులు పొందే సాధారణ మొత్తం గురించి పరిశ్రమకు అవగాహన ఉంటుందని అన్నారు.
అన్‌ఫిల్టర్డ్ బై సమ్దీష్ ఎపిసోడ్ సందర్భంగా తారల సంపాదన గురించి హోస్ట్ నవాజుద్దీన్‌ని అడిగారు. దానికి సిద్ధిఖీ స్పందిస్తూ -``వారు చాలా సంపాదిస్తారు.. నటీనటులు దాదాపు 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తారా? అని హోస్ట్ ఆరా తీసింది. దానికి ఎక్కడో కొందరు'' అని బదులిచ్చారు. మీరు మేకర్స్ ని పారితోషికం పెంచాలని చర్చలు జరుపుతున్నారా? అని అడిగినప్పుడు ''నేను పెద్దగా చర్చలు జరపను. నటీనటులకు ఎంత అర్హత ఉందో అంతే పరిశ్రమ ఇస్తుంది. ఒక నటుడు చర్చలు జరిపితే, `మీకు అంత అర్హత ఉందా?` అని అడుగుతారని తెలిపారు.
తనకు పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినా కానీ చిన్న పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు నవాజుద్దీన్ చెప్పారు. కోటి ఆఫర్ చేసినా నేను చిన్న పాత్ర చేయను.. డబ్బు, కీర్తి అనేవి మనం చేసిన పనికి ఉప-ఉత్పత్తులు. మీరు మీ పనిని బాగా చేస్తే, డబ్బు కీర్తి మీ వెంటే పరిగెత్తుకు వస్తాయి. మీరు డబ్బును వెంబడిస్తే, దానిని ఎప్పటికీ కనుగొనలేరు.. కాబట్టి మంచి పని చేస్తూనే ఉండండి``అని నవాజుద్దీన్ అన్నారు.