పడగొట్టిన ప్రతిసారీ లేచాను: న‌య‌న‌తార‌

దాదాపు రెండు దశాబ్దాలుగా పురుషాధిక్య పరిశ్రమలో అసాధార‌ణ విజ‌యాలు సాధించింది. షోబిజ్‌లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా న‌య‌న్ తన అభిమానులను కృతజ్ఞతా పత్రాన్ని రాసింది.

Update: 2023-12-30 11:30 GMT

బుల్లితెర యాంక‌ర్ నుంచి న‌టిగా మారిన‌ నయనతార అగ్ర క‌థానాయిక‌గా ఎదురేలేని స్థానానికి ఎదిగారు. త‌లైవిగా త‌మిళ‌నాట పిలుపందుకున్న ఏకైక ప్ర‌తిభావ‌ని. అభిమానులు తమిళ సినిమా లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు. త‌మిళ‌ పరిశ్రమలోకి ప్రవేశించినప్పటి నుండి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా మారింది. అందానికి అందం ప్రతిభతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే మ్యాజిక్ త‌న సొంతం. దాదాపు రెండు దశాబ్దాలుగా పురుషాధిక్య పరిశ్రమలో అసాధార‌ణ విజ‌యాలు సాధించింది. షోబిజ్‌లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా న‌య‌న్ తన అభిమానులను కృతజ్ఞతా పత్రాన్ని రాసింది.


ఆ నోట్‌లో విష‌యాలు ఇలా ఉన్నాయి. "20 ఏళ్ల తర్వాత కూడా నేను ఈ రంగంలో నిలబడటానికి కారణం మీరే. నా కెరీర్‌కు గుండె చప్పుడు.. నా ప్ర‌యాణానికి చోదక శక్తి.. న‌న్ను ప‌డ‌గొట్టిన‌ ప్రతిసారీ తిరిగి లేవడానికి కారణం మీరే. మీరు లేకుండా ఈ ప్రయాణం అసంపూర్ణం. సమీపంలోని వారు లేదా దూరంగా ఉన్న నా అభిమానులందరికీ ధ‌న్య‌వాదాలు.. మీరు ప్రత్యేకమైనవారు. ప్రతి ప్రాజెక్ట్‌ను కేవలం ఒక అద్భుతంగా మార్చే మ్యాజిక్ మీరు. నేను ఈ మైలురాయిని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. రెండు దశాబ్దాలుగా సినిమా రంగంలో అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన శక్తి మీరు" అని ఎమోష‌న‌ల్ అయ్యారు న‌య‌న్.

పరిశ్రమలో నయనతార ప్రయాణం ఎత్తుపల్లాలతో కూడుకున్న‌ది. తన ప్రారంభ ప్రయాణంలో కొన్ని ప‌రాజ‌యాల్ని ఎదుర్కొంది. ఒకానొక సంద‌ర్భంలో 2011లో శ్రీరామరాజ్యం విడుదలైన తర్వాత వినోద పరిశ్రమను విడిచిపెట్టాలని కూడా న‌య‌న‌తార‌ భావించింది. అయితే రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత 'రాజా రాణి' చిత్రంతో పెద్ద విజ‌యం అందుకుని బలంగా తిరిగి వచ్చింది. ఈ కంబ్యాక్ న‌య‌న్ జీవితాన్ని శాశ్వతంగా మార్చింది. నయనతార మధ్యస్థ స్క్రిప్ట్‌లపై దృష్టి పెట్టకూడదని నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లకు మాత్ర‌మే సంత‌కాలు చేసింది. స్వతంత్రంగా సినిమాల‌ను త‌న భుజ‌స్కంధాల‌పై తీసుకెళ్లగల సామర్థ్యాన్ని చూపింది. మాయ, డోర, అరమ్ వంటి అనేక మహిళా సెంట్రిక్ సినిమాలతో విజ‌యాలు అందుకుంది. తిరుగేలేని ఛ‌రిష్మా దృష్ట్యా న‌య‌న్ ని ఫ్యాన్స్ లేడీ సూపర్ స్టార్ అని ఆరాధిస్తున్నారు.

త‌లైవి నయనతార ఈ ఏడాది ప్రారంభంలో షారుఖ్‌ ఖాన్‌ 'జవాన్‌'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. త‌దుప‌రి 'కర్ణ' చిత్రంలో ప్రధాన పాత్ర కోసం నయనతార పేరును పరిశీలిస్తున్నట్లు క‌థ‌నాలొచ్చాయి. బాలీవుడ్ లో రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా న‌య‌న్ నటనా నైపుణ్యానికి ముగ్ధుడై తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో న‌య‌న‌తార‌ను తీసుకోవాలని ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అలాగే నయనతార తమిళ డ్రామా చిత్రం 'అన్నపూర్ణి - ది గాడెస్ ఆఫ్ ఫుడ్‌'లో న‌టిస్తోంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. అట్లీ 2013 చిత్రం రాజా రాణి తర్వాత జైతో క‌లిసి తిరిగి న‌య‌న్ న‌టిస్తోంది.

Tags:    

Similar News