నివేదా.. ఏ మూవీ ప్రమోషనమ్మా ఇది?
తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ నివేదా పేతురాజ్
తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ నివేదా పేతురాజ్. తన అందం, అభినయంతో స్పెషల్ ఫ్యాన్ బేస్ దక్కించుకుంది. వరుస సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. గత ఏడాది దాస్ కా ధమ్కీ తర్వాత ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయలేదు. బయట కూడా కనిపించడం లేదు.
ఇదే సమయంలో తాజాగా నివేదా పేతురాజ్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో నివేదా పోలీసులతో గొడవ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. అయితే వీడియో చూసిన నెటిజన్లు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కామెంట్లు పెడుతున్నారు. నివేదా కూడా ఇప్పటి వరకు ఎక్కడా వీడియోపై స్పందించలేదు. అసలేం జరిగిందంటే?
వీడియో ప్రకారం.. కారులో వెళ్తున్న నివేదాను పోలీసులు ఆపి డిక్కీ ఓపెన్ చేయాలని కోరారు. అందుకే ఆమె ఒప్పుకోలేదు. దానికి బదులుగా పోలీసులతో కోపంగా మాట్లాడింది. "రోడ్డు వరకు నేను వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్ ఉన్నాయి. మీకు కావాలంటే చూపిస్తాను. చెక్ చేసుకోండి" అని నివేదా తెలిపింది. అయినా పోలీసులు అవేం వద్దని, కారు డిక్కీ ఓపెన్ చేయండి మేడమ్ అని గట్టిగా అడుగుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
దీంతో అర్థం చేసుకోండని, తమ కుటుంబ పరువుకు సంబంధించినదని చెప్పింది నివేదా. డిక్కీలో ఏం లేవని, ఇప్పుడు చెప్పినా మీకు (పోలీసులకు) అర్థం కాదని అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో రికార్డ్ చేస్తున్న కెమెరా వైపు చూస్తూ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నారు... ఆపండంటూ మొబైల్ తీసేసుకుంది. ఇంతటితో ముగిసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఏదో సినిమా ప్రమోషన్స్ వీడియోలా ఉందని చాలా మంది నెటిజన్లు చెబుతున్నారు. ఏ మూవీ ప్రమోషన్ మేడమ్ అని అడుగుతున్నారు. వీడియోలో పోలీసులు షూస్ వేసుకోవడానికి బదులు క్రాక్స్ (చెప్పులు) వేసుకోవడాన్ని కొంతమంది గమనించారు. ఇదే విషయాన్ని చెబుతూ ఇది పక్కా ప్రమోషనల్ వీడియోనే అని తేల్చేస్తున్నారు. ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగమే వైరల్ వీడియో అని అనుమానపడుతున్నారు. మరి ఏది నిజమో తెలియాల్సి ఉంది.