హక్కులంటూ అసహనం వ్యక్తం చేసిన హీరోయిన్!
విషయం ఏదైనా సరే తమకి నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. అలాగే నాకు కూడా ఈ విషయం పై బాధపడే హక్కు ఉంది.
బాలీవుడ్ బ్యూటీ నష్రత్ బరుచా టాలీవుడ్ కి సుపరిచితమే. దశాబ్ధం క్రితం ' తాజ్ మహల్ 'సినిమాతో లాంచ్ అయింది. ఆ సినిమా పెద్దగా ఆకపోవడంతో ఇక్కడ జర్నీ కొనసాగించలేదు. కెరీర్ కూడా అప్పుడే ప్రారంభం కావడంతో బాలీవుడ్ చిత్రాలపైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం అక్కడ అమ్మడు బిజీగానే కొనసాగుతుంది. 2023 లో మరీ బిజీగా ఉందని లైనప్ చూస్తే తెలుస్తోంది. అయితే ఈ బ్యూటీనే హిందీ 'ఛత్రపతి' రీమేక్ లోనూ నటించింది. అందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి జోడీగా కనిపించింది.
ఈ సినిమా కూడా పరాజయం చెందింది. దీంతో మరోసారి నష్రత్ కి తెలుగు సినిమా బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడినట్లు అయింది. ప్రస్తుతం నష్రత్ హిందీలో నాలుగైదు సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'డ్రీమ్ గర్ల్ -2'లో అవకాశం ఇవ్వకపోవడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేసింది. 'డ్రీమ్ గర్ల్' లో నేను హీరోయిన్ గా నటించా. ఆ యూనిట్ అంటే నాకెంతో గౌరవం. వాళ్లతో కలిసి పనిచేయడానికి ఎంతో మిస్ అవుతున్నా. డ్రీమ్ గర్ల్-2 లో నాకెందుకు ఛాన్స్ ఇవ్వలేదో తెలియదు.
ఈ ప్రశ్నకి మేకర్స్ మాత్రమే సమాధానం చెప్పగలరు. అవకాశం ఇవ్వనందుకు నేనైతే చాలా బాధపడుతున్నా. విషయం ఏదైనా సరే తమకి నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. అలాగే నాకు కూడా ఈ విషయం పై బాధపడే హక్కు ఉంది. ఆ బాధని స్వేచ్ఛగా చెప్పే హక్కు ఉంది' అని తెలిపింది. మరి దీనిపై చిత్ర యూనిట్ ఏదైనా సమాధానం ఇస్తుందా? అన్నది చూడాలి.
ఆయుష్మాన్ ఖురానా హీరోగా డ్రీమ్ గర్ల్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2019 లో ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని సాధించింది. దీంతో సీక్వెల్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. రెండు సంవత్సరాల వ్యవధిలోనే డ్రీమ్ గర్ల్-2ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సీక్వెల్ లో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.