సెన్సార్ కాకుండానే OPBK బుకింగ్స్- నిర్మాత కంప్లైంట్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఊరి పేరు భైరవకోన మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఊరి పేరు భైరవకోన మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఈ మూవీపై సీబీఎఫ్‌సీకి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) నిర్మాత నట్టి కుమార్ ఫిర్యాదు చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడానికి ముందే బుక్ మైషోతో పాటు ఇతర బుకింగ్స్ యాప్స్ లో సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కావడంపై నట్టికుమార్ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
సెన్సార్ నిబంధనల ప్రకారం, సర్టిఫికెట్ ఇష్యూ చేయకుండా సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రచారం చేయరాదట. అలాగే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయకూడదట. ఊరు పేరు భైరవకోన మూవీ ఈ రెండు నిబంధనలను అతిక్రమించినట్లు తన ఫిర్యాదు లేఖలో నట్టి కుమార్ పేర్కొన్నారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపేయాలని నట్టి కుమార్ డిమాండ్ చేశారు. తక్షణమే విచారణ జరపాలని లేఖలో కోరారు.
"ఊరు పేరు భైరవకోన సినిమా టిక్కెట్లు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడానికి ముందే బుక్ మై షోలో ఓపెన్ అయ్యాయి. సెన్సార్ నిబంధనల ప్రకారం సర్టిఫికెట్ ఇవ్వకుండా సినిమా విడుదల తేదీని ప్రచారం చేయకూడదు. సెన్సార్ నిబంధనలకు విరుద్ధంగా బుక్ మై షో లో టికెట్లు తెరిచారు. మా ఫిర్యాదులోని ఈ రెండు అంశాలపై చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అలాగే ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు ఏ తేదీన సెన్సార్ కు దరఖాస్తు చేసుకున్నారు? వారికి అప్లై చేసిన ఆర్డర్ లిస్ట్‌లో చాలా సినిమాలు సెన్సార్ స్క్రీనింగ్ కోసం పెండింగ్‌లో ఉండగా ఈ సినిమాను ముందుగా ఎందుకు సెన్సార్ చేయాల్సి వచ్చింది?"
"హైదరాబాద్ రీజినల్ సెన్సార్ బోర్డు వారు దీనికి బాధ్యులు అని తేలితే విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారో తెలియకుండా నిబంధనలు బ్రేక్ చేస్తూ బుక్ మై షో టిక్కెట్లను ఎలా తెరుస్తారు? పిల్లలు చూడకూడని సర్టిఫికేట్ జారీ చేస్తే, ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్న వారికి ఎవరు బాధ్యత వహిస్తారు?" అని నట్టి ప్రశ్నించారు.
ఊరు పేరు భైరవకోన కంటే ముందు యాత్ర 2 విషయంలో ఇలాగే జరిగిందని నట్టి కుమార్ తెలిపారు. "సెన్సార్ సర్టిఫికెట్ రాకముందే ఆ సినిమా రిలీజ్ డేట్ గురించి ప్రచారం చేశారు. బుక్ మై షోలో టిక్కెట్లను ఓపెన్ చేశారు. తెలుగు భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి పెద్ద నిర్మాతలు సెన్సార్ కు అప్లై చేసిన వెంటనే సర్టిఫికెట్లు పొందుతున్నారు. చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాల సెన్సార్ కోసం దరఖాస్తు చేసుకుని రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది" అని నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్ కోసం అప్లై చేసుకున్న ఆర్డర్ లో కాకుండా నిబంధనలకు విరుద్దంగా సెన్సార్ జరుపుతుండటంపై విచారణ జరపాలని నట్టి కుమార్ డిమాండ్ చేశారు.
హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఊరు పేరు భైరవకోన సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. టైగర్ తర్వాత సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీని రాజేష్ దండా నిర్మించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. రవితేజ ఈగల్ కోసం వారం వాయిదాపడింది. మరి ఈ సెన్సార్ వివాదంలో ఏం జరుగుతుందో చూడాలి.