ఓటీటీలన్నిటికీ ఒకటే రూల్ అయినా కానీ!
రూల్ ఈజ్ రూల్ .. రూల్ ఫర్ ఆల్! ఒకసారి కేంద్రం రాజముద్ర పడిన తర్వాత ఆ నియమం అన్ని ఓటీటీలకు వర్తిస్తుంది.
రూల్ ఈజ్ రూల్ .. రూల్ ఫర్ ఆల్! ఒకసారి కేంద్రం రాజముద్ర పడిన తర్వాత ఆ నియమం అన్ని ఓటీటీలకు వర్తిస్తుంది. అమెజాన్ ప్రైమ్.. డిస్నీ హాట్ స్టార్.. నెట్ ఫ్లిక్స్.. ఇలా అన్నిటికీ ఒకటే రూల్. సవరించిన నియమాల ప్రకారం కంటెంట్ ని పునః సమీక్షించుకుని దానిలోని అశ్లీలతను అసభ్యతను తొలగించాల్సి ఉంటుంది. సున్నితమైన అంశాలు మానవ ఉద్వేగాలను ప్రభావితం చేసే కంటెంట్ విషయంలో ఎడిటింగ్ తప్పనిసరి. ఈ విషయంలో సెన్సార్ షిప్ నియమాలు ఇప్పుడు కఠినంగా మారిన సంగతి తెలిసిందే.
అయితే చాలా ఓటీటీలు మారిన నియమనిబంధనలను పాటిస్తూ కంటెంట్ లో మార్పులు చేస్తుంటే ఇప్పటివరకూ నెట్ ఫ్లిక్స్ దీనిని అమలు చేయలేదు. ఈ కొత్త నియమానికి నిరసనగా సదరు సంస్థ ప్రతినిధులు సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇకపై నెట్ ఫ్లిక్స్ లోను ఈ పప్పులేవీ ఉడకవని కేంద్ర మంత్రిత్వ శాఖ హుకుం జారీ చేసినట్టు చెబుతున్నారు. ఇకపై నెట్ ఫ్లిక్స్ తన కంటెంట్ ని ఇండియాలో, అలాగే ఇండియన్ డయాస్పోరా(విదేశాల్లోను)లో ఎక్కడైనా కచ్ఛితంగా సెన్సార్ షిప్ చేయాల్సి ఉంటుంది. అశ్లీలత, అసభ్యత, సెన్సిటివ్ సన్నివేశాల విషయంలో ఎడిట్ ప్రక్రియ తప్పనిసరి చేయాల్సి ఉంది. నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటివరకూ సెన్సార్ లేకుండానే ఒరిజినల్ సిరీస్ లు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. కానీ ఇకపై అలా కుదరదని తెలుస్తోంది.
ఇన్నాళ్లు ఓటీటీల ఆటలు సాగాయి. సృజనాత్మకత పేరుతో హద్దు మీరిన ఎక్స్ పోజింగ్ వేడెక్కించే సన్నివేశాలతో ఓటీటీ సినిమాలు సిరీస్ లు యువతరాన్ని ఆకర్షించాయి. నగ్నత్వం.. అసభ్యత.. ద్వంద్వార్థాలు .. శ్రుతిమించిన బోల్డ్ దృశ్యాలు ఈ వేదికల్లో సర్వసాధారణమయ్యాయి. వెబ్ సినిమాలు .. సిరీస్ లు డిజిటల్ వేదికలపైనా విశృంఖలత పెట్రేగిందని సాంప్రదాయవాదులు విమర్శించారు. ఓటీటీలతో యువతరం చెడిపోతోందన్న విమర్శలు బలంగా ఉన్నాయి. అయితే దీనికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చాలా ప్రిపరేషన్ సాగించింది. ఇటీవల OTT లు డిజిటల్ వార్తల్ని సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తెస్తూ జీవో విడుదల చేసింది. సెన్సార్ షిప్ పరిధిలోకి డిజిటల్ కంటెంట్ ని అడాప్ట్ చేసింది. ఇప్పుడు సమాచార ప్రసారాల శాఖ పరిధిలోకి డిజిటల్ కంటెంట్ చేరడం అన్నిటికీ చెక్ పెట్టేస్తున్నట్టే. ఓటీటీల విశృంఖలతకు అడ్డు కట్ట వేసేందుకే ఈ ప్రయత్నం. కానీ నెట్ ఫ్లిక్స్ లో హద్దులు చెరిపేసే శృంగార కంటెంట్ ని తొలగించేందుకు ఎడిట్ చేయడానికి సిద్ధంగా లేదని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.