2025: పాన్ ఇండియా రిలీజులు.. క్లారిటీ మిస్సవుతోందిగా!
వాటిల్లో 'హను-మాన్', 'కల్కి 2898 ఏడీ', 'దేవర పార్ట్-1', 'పుష్ప 2: ది రూల్' వంటి కొన్ని సినిమాలు మాత్రమే వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి.
గడిచిన ఏడాది కాలంలో టాలీవుడ్ నుంచి అనేక పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. వాటిల్లో 'హను-మాన్', 'కల్కి 2898 ఏడీ', 'దేవర పార్ట్-1', 'పుష్ప 2: ది రూల్' వంటి కొన్ని సినిమాలు మాత్రమే వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. దీంతో ఇప్పుడు 2025లో వచ్చే పాన్ ఇండియా చిత్రాల మీద అందరి దృష్టి పడింది. ఎందుకంటే ఈ సంవత్సరంలో స్టార్ హీరోలు నటిస్తున్న పెద్ద సినిమాలు, పలు భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కాకపోతే వాటి విడుదల తేదీల్లోనే గందరగోళం నెలకొంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీ "విశ్వంభర". వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది కానీ, రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' రావడంతో ఫెస్టివల్ రేసు నుండి తప్పుకుంది. అయితే చిరు సినిమాని మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. సమ్మర్‌లో విడుదల కానుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ, ఇప్పటికే ఆ సీజన్ లో అనేక పెద్ద సినిమాల రిలీజులు ప్రకటించబడ్డాయి. ఒకవేళ విశ్వంభర మూవీ రావాలని అనుకుంటే, మిగతా చిత్రాలను వాయిదా వేసుకోవలసి అవసరం ఉంటుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమాని వేసవిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మారుతీ దర్శకత్వంలో ఈ రొమాంటిక్ హారర్ కామెడీ తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే సీజీ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల విడుదలలో జాప్యం జరుగుతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే సిద్ధూ జొన్నలగడ్డ 'జాక్' మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
తేజ సజ్జ నటిస్తున్న 'మిరాయ్' సినిమాని ఏప్రిల్ 18న విడుదల చేస్తామని షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడే డేట్ వేశారు. కానీ అదే తేదీకి అనుష్క శెట్టి పాన్ ఇండియా మూవీ 'ఘాటి' వస్తుందని ప్రకటించారు. ఆ తర్వాతి వారంలో ఏప్రిల్ 25న మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' రానుందని చెబుతున్నారు. కానీ 'ది రాజాసాబ్' చెప్పిన డేట్ కి రావాలని ఫిక్స్ అయితే మాత్రం ఈ మూడు సినిమాల విడుదల తేదీలలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇక ధనుష్, కింగ్ అక్కినేని నాగార్జున కలిసి నటిస్తున్న 'కుబేర' చిత్రాన్ని మార్చి లేదా ఏప్రిల్ లో రిలీజ్ చేస్తారని అంటున్నారు.
విజయ్ దేవరకొండ నటిస్తున్న 'VD 12' సినిమాని మార్చి 28న థియేటర్లలోకి తీసుకొస్తామని చాన్నాళ్ళ కిందటే ప్రకటించారు. కానీ అదే డేట్ కు పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు' మూవీని షెడ్యూల్ చేయబడింది. ఆయన నటిస్తున్న OG మూవీని కూడా మార్చి నెలాఖరున రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పారు కానీ, పవన్ ప్రాధాన్యతను బట్టి చూస్తే ముందుగా వీరమల్లు వస్తుందని స్పష్టమవుతోంది. అదే జరిగితే రౌడీ స్టార్ మూవీని పోస్ట్ పోన్ చెయ్యాల్సి ఉంటుంది. కాకపోతే తర్వాత ఏ డేట్ కు వెళ్తారనేదే తెలియడం లేదు.
దసరా సీజన్ మీద అందరి కంటే ముందు నందమూరి బాలకృష్ణ కర్చీఫ్ వేశారు. 'అఖండ 2: తాండవం' చిత్రం కోసం సెప్టెంబర్ 25న తేదీని ఖరారు చేశారు. కానీ సాయి దుర్గ తేజ్ నటిస్తున్న 'SYG - సంబరాల ఏటుగట్టు' సినిమాని అదే డేట్ కి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఒకవేళ 'రాజా సాబ్' మార్చి నుంచి షిఫ్ట్ అయితే, విజయ దశమికి వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ డేట్స్ ఇస్తే 'ఓజీ' మూవీ కూడా అదే సీజన్ లో ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది. వీటికి తోడు 'కాంతార చాప్టర్ 1' లాంటి డబ్బింగ్ సినిమాలు కూడా పోటీకి వస్తున్నాయి. ఇలా 2025లో ప్లాన్ చేయబడిన పాన్ ఇండియన్ సినిమాల రిలీజ్ డేట్స్ లో క్లారిటీ రావడం లేదు. విడుదల తేదీలు ప్రకటిస్తూ ఏ సినిమా ఎప్పుడు వస్తుందనేది కచ్ఛితంగా తెలియడం లేదు.