ఓటు వేయని వారిని శిక్షించాలి!
గతంలో ఎన్నడు లేనంతగా ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాంతం అంతకంతకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు..రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పౌరులంతా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున ఓటు వేస్తున్నారు. విదేశాల్లో ఉన్న వారు...షూటింగ్ లో ఉన్న వారు సైతం స్వదేశానికి చేరుకుని ఓటు వేస్తున్నారు. పరేష్ రావల్.. సాన్యా మల్హోత్రా.. జాన్వీకపూర్, రాజ్ కుమార్ రావ్.. అక్షయ్ కుమార్..పర్హాన్ అక్తర్.. జోయా అక్తర్.. షాహిద్ కపూర్ తదితరులంతా ఓటు వేసారు.
గతంలో ఎన్నడు లేనంతగా ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాంతం అంతకంతకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా ఓటు వేయని వారపై నటుడు పరేష్ రావల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. `ఓటు వేయని వారిపై అధిక పన్నులు విధించడమో.. ప్రభుత్వం శిక్షించడమో చేయాలి. ప్రభుత్వం ఏం చేయట్లేదని ప్రజలు చెబుతున్నారు. కానీ బయటకు వచ్చి ఓటు వేయకపోతే అప్పుడు ఆసమస్యలు అన్నింటికీ ప్రజలే బాధ్యులు. ప్రభుత్వం కాదు` అని ముంబైలో ఓటు వేసిన అనంతరం పేర్కొన్నారు.
అలాగే బాలీవుడ్ సెలబ్రిటీలంతా కూడా ఓటు వేయడానికి కదలి రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాధారణంగా సెలబ్రిటీలు కాలనీల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమెదవుతుందని చాలా కాలంగా ఆరోపణ ఉంది. సినిమా షూటింగ్ లనో..వెకేషన్ను అనో బయట ఎక్కువగా ఉంటుంటారు. ఉన్నవారు కూడా సవ్యంగా వచ్చి ఓటు వేయరని ఆరోపణలున్నాయి.
అందులోనూ స్టార్ హీరోలు వచ్చి ఓటు వేయరని గతంలో విమర్శలొచ్చిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయితే గత రెండు దఫాలుగా సెలబ్రిటీల ఓటింగ్ శాతం కూడా పెరిగింది. చాలా మందిస్టార్ హీరోలు..హీరోయిన్లు కూడా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవల ఏపీ-తెలంగాణ లో జరిగిన ఎన్నికల్లో దాదాపు అందుబాటులో ఉన్న సెలబ్రిటీలంతా ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి తెలిసిందే.