గుంటూరు కారం పరుచూరికి నచ్చలేదా..?

సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ రిలీజైన స్టార్ హీరోల సినిమాలకు రివ్యూ ఇస్తూ సినిమాలో ప్లస్సులను మైనస్సులను ప్రస్తావిస్తూ సినిమాలో మార్పులను సూచిస్తూ ఇలా చేస్తే బాగుండేది అనే కామెంట్ కూడా ఇస్తారు.

Update: 2024-02-17 06:37 GMT

సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ రిలీజైన స్టార్ హీరోల సినిమాలకు రివ్యూ ఇస్తూ సినిమాలో ప్లస్సులను మైనస్సులను ప్రస్తావిస్తూ సినిమాలో మార్పులను సూచిస్తూ ఇలా చేస్తే బాగుండేది అనే కామెంట్ కూడా ఇస్తారు. అలా పరుచూరి గోపాలకృష్ణ రివ్యూస్ కి క్రేజ్ పెరిగింది. కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు సినిమా వాళ్లు కూడా ఫలానా సినిమాకు పరుచూరి ఎలా రివ్యూ ఇస్తారనే ఆసక్తి ఏర్పడింది. థియేట్రికల్ రిలీజ్ చూసి రివ్యూ ఇవ్వడం అందరు చేస్తారు. కానీ థియేట్రికల్ రన్ ముగిసి ఓటీటీ రిలీజ్ అయ్యాక రివ్యూ ఇవ్వడమే పరుచూరి స్టైల్.

సినిమా ఆల్రెడీ చూశాం కదా ఆయన రివ్యూ ఏం చెబుతారులే అనుకుంటే పొరబడినట్టే. సినిమాని ఆయన పంథాలో విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తుంటారు పరుచూరి. లేటెస్ట్ ఆ పరుచూరి పలుకులులో సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా గురించి ప్రస్తావించారు. ఇది మహేష్ స్థాయి సినిమా కాదనేది తన అభిప్రాయమని చెప్పి షాక్ ఇచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.

తాను ఎవరినీ విమర్శించడం లేదు కానీ ఈ సినిమా గురించి తప్పకుండా మాట్లాడాలి.. ఎందుకంటే మహేష్ అంటే నాకు అభిమానం ఉంది. 350 సినిమాకు పైగా పనిచేసిన తనకు గుంటూరు కారం కథనం కాస్త కన్ఫ్యూజ్ గా అనిపించిందని అన్నారు. ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో తెలియదు అయితే రెండోసారి చూస్తే స్పష్టత రావొచ్చేమో అని అన్నారు. డైరెక్టర్ త్రివిక్రం స్క్రీన్ ప్లే తో ఆడుకున్నాడు. 200 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే కనీసం 300 కోట్లు వసూళ్లు తెస్తే తప్ప లాభం ఉండదనేది ఇండస్ట్రీ టాక్. 2021 లో మొదలైన ఈ సినిమా 2024 లో రిలీజ్ అవ్వడం వల్ల ఈ గ్యాప్ లో కథ, కథనంలో చిత్ర యూనిట్ తేడా వచ్చి ఉంటాయని ఆయన అన్నారు.

గుంటూరు కారం అంత ఘాటుగా హీరో పాత్రను క్రియేట్ చేశారు. త్రివిక్రమ్ మంచి టైటిల్స్ పెడతారు అయితే ఆయన సినిమాలన్నిటిలో ఇది కాస్త తేడాగా అనిపించిందని అన్నారు. తల్లి వద్దనుకుంటే ఆ డాక్యుమెంట్స్ పై హీరో సంతకం పెడతాడా లేదా అనే పాయింట్ తో కంపోజింగ్ సీన్స్ రాశారు. అయితే బాలకృష్ణ శారద, చిరంజీవి వాణిశ్రీ తరహాలో మహేష్ రమ్యకృష్ణ కాంబో ఉంటుందని తాను ఊహించుకున్నా.. ఇది తల్లీ కొడుకుల కథ. ఇందులో హీరో అమ్మను దైవంలా భావిస్తాడు తప్ప టీజ్ చేయలేడు.. ఇబ్బంది కూడా పెట్టలేడు. ఈ సినిమాలో జరిగిన పొరపాటు అదే. అద్భుతంగా కథలు రాసే త్రివిక్రమ్ ఇది చాలని అనుకున్నారేమో అని అన్నారు.

తాతా మనవడు, తల్లి కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చి సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే. ఇందులో ఈ రెండు పండలేదు. ఒకవేళ సెంటిమెంట్ ప్రధానంగా తీద్దామనుకుంటే ఆ టైటిలే తప్పు. గుంటూరు అబ్బాయి అని పెడితే కుటుంబ కథా చిత్రం చూడబోతున్నామని ఆడియన్స్ అనుకుని ఉండేవారని పరుచూరి అన్నారు. గుంటూరు కారం టైటిల్ పెట్టి ఆ పేరుకి సరిపోయేలా స్క్రీన్ ప్లే సెట్ చేశారు. హీరోతో సంతకం పెట్టించేందుకు హీరోయిన్ హీరో ఇంటికి రావడం ప్రేమలో పడేయాలనుకోవడం ఇది పాజిటివ్ యాంగిల్ కాదని అన్నారు.

అలా కాకుండా రమ్యకృష్ణ కుటుంబానికి సంబంధించిన ఎమోషన్స్ ను ఇంకా డెవలప్ చేసి ఉంటే సినిమా మరోలా ఉండేదని అన్నారు. ఒక దశలో ఫలానా పాత్రలో మార్పు వస్తుందని ఊహించా కానీ అలా జరగలేదు. క్యారెక్టర్ రియలైజేషన్ వస్తే ప్రేక్షకుల హృదయానికి టచ్ అవుతుంది. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ కాబట్టి సినిమాకు వసూళ్లు వస్తాయి. డబ్బులు రావడం వేరు సంతృప్తి రావడం వేరు. త్రివిక్రమ్ అంటే నాకు అభిమానం మరో మంచి కథతో ఆయన వస్తారని ఆశిస్తున్నా అని అన్నారు పరుచూరి. సో పరుచూరి రివ్యూ చూస్తే సినిమా ఆయన్ను పూర్తిగా డిజప్పాయింట్ చేసిందని అర్థమవుతుంది. అయితే సినిమా కమర్షియల్ సక్సెస్ అయినా కూడా సంతృప్తి ఇవ్వడం ముఖ్యమని చెప్పి షాక్ ఇచ్చారు పరుచూరి.

Tags:    

Similar News