ల‌డ్డూ వివాదం: సారీ చెప్పిన కార్తీ.. ప‌వ‌న్ రిప్ల‌య్ ఇదీ!

తిరుపతి లడ్డూ వివాదంలో హీరో కార్తీ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-24 16:53 GMT

తిరుపతి లడ్డూ వివాదంలో హీరో కార్తీ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో లడ్డూలలో జంతువుల కొవ్వు పదార్ధంతో త‌యారు చేసిన ఆయిల్ ని ఉప‌యోగిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ సాగుతున్న త‌రుణంలో ఓ సినిమా ప్ర‌చార వేదిక‌పై కార్తీ చేసిన వ్యాఖ్య‌లు నెగెటివ్ గా డ్రాగ్ అయ్యాయి.

సినిమా ప్ర‌చార వేదిక‌పై తిరుపతి లడ్డూ సమస్యను ప్రస్తావిస్తూ `ల‌డ్డూ గురించి ఇక్క‌డ మాట్లాడ‌కూడ‌దు` అంటూ కార్తీ వ్యాఖ్యానించాడు. ఆ స‌మ‌యంలో అత‌డు న‌వ్వుతూ క‌నిపించాడు. అత‌డి ఇంటెన్ష‌న్ ఏదైనా కానీ, తమ వాద‌న‌ను కించపరిచినందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై సీరియ‌స్ అయ్యారు. కానీ చివ‌రికి కార్తీ త‌న త‌ప్పుడు వైఖ‌రికి క్షమాపణలు చెప్ప‌డం ద్వారా ప‌వ‌న్ ని శాంత‌ప‌రిచారు. కార్తీ సారీ చెప్పిన కొన్ని గంటల తర్వాత పవన్ ఇంటెన్సిటీలో మార్పు క‌నిపించింది.

మ‌రింత‌గా వివ‌రంలోకి వెళితే... కార్తీ న‌టించిన `సత్యం సుందరం` తెలుగులో విడుదల కానుండగా ప్ర‌చార కార్య‌క్ర‌మంలో అత‌డు న‌టించిన 2011 చిత్రం సిరుత్తై నుండి లడ్డూలను కలిగి ఉన్న ఒక జ్ఞాపకాన్ని వేదిక‌పై చూపించారు. ఆ ల‌డ్డూను చూడ‌గానే ``ఇది సున్నితమైన సమస్య.. దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడ‌దు`` అంటూ న‌వ్వేశాడు కార్తీ. అయితే పవన్ కళ్యాణ్ అత‌డి నవ్వుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూల గురించి జోకులు వేయవద్దని, ఎవరి పేరు ప్ర‌స్థావించ‌కుండానే సినీ ప్రముఖులందరికీ వార్నింగ్ ఇచ్చాడు. నటుడిగా నేను మిమ్మల్ని గౌరవిస్తాను.. ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని లేదా మౌనంగా ఉండమని సినీ ప్రముఖులందరినీ కోరుతున్నాను అని ఆయన మీడియాతో అన్నారు.

దీనికి ప్ర‌తిస్పందించిన కార్తీ ``వేంకటేశ్వరునికి వినయపూర్వకమైన భక్తుడిగా నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను`` అని చెబుతూ పవన్‌కు క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు టెన్షన్‌ని సడలిస్తూ పవన్ క్షమాపణలను పెద్ద మ‌న‌సుతో స్వీక‌రించారు. ఈ మాట‌లు ఉద్ధేశ‌పూర్వ‌కంగా వ‌చ్చిన‌వి కావ‌ని నేను గ‌మ‌నించాను. కానీ ఇలాంటి సున్నిత అంశాల్లో అలా జ‌ర‌గ‌కూడ‌దు. తిరుపతి కానీ లడ్డూ ప్ర‌సాదం కానీ వాటి పవిత్రత‌ చుట్టూ కోట్లాది మంది హిందూ భక్తులకు లోతైన భావోద్వేగంతో ఉంటార‌ని, ప్రముఖులు అలాంటి విషయాలపై జాగ్రత్తగా మాట్లాడాల‌ని ప‌వ‌న్ సూచించారు. ``ప్రజానాయకులుగా మన బాధ్యత ఐక్యత- గౌరవాన్ని పెంపొందించడం.. ప్రత్యేకించి మనం ఎక్కువగా ఆరాధించే వాటి గురించి-మన సంస్కృతి, ఆధ్యాత్మిక విలువల గురించి ఆలోచించాలి`` అని ప‌వ‌న్ అన్నారు. కార్తీ త‌న రాబోవు చిత్రంతో విజయం సాధించాలని కూడా ప‌వ‌న్ కోరుకున్నారు. సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ స్పంద‌న‌కు గౌరవ సూచకంగా, పోస్ట్‌పై చేసిన వ్యాఖ్యలో ఆంధ్రప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రికి కార్తీ కృతజ్ఞతలు తెలిపారు.

సెప్టెంబర్ 27న తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న `మెయ్యళగన్`(స‌త్యం సుంద‌రం) చిత్రానికి ఈ ఎపిసోడ్ తో కావాల్సినంత ప్ర‌మోష‌న్ వ‌చ్చింది. ప‌వ‌న్ వ‌ర్సెస్ కార్తీ ఎపిసోడ్స్ తెలియ‌ని ఆ సినిమా పేరును బాగానే తెలిసేలా చేసాయి. కార్తీ తక్షణ క్షమాపణల ప్రభావం టికెట్ సేల్ పై ఎలా ఉంటుందో చూడాలి. పవన్ కళ్యాణ్ క్షమాపణలను త్వరగా అంగీకరించడం, కార్తీకి ఆల్ ది బెస్ట్ చెప్ప‌డం ఇక్క‌డ గ‌మ‌నించ‌ద‌గిన‌ది. ప‌వన్ న‌టించిన హరి హర వీర మల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్, ఉస్తాద్ భగత్ సింగ్ , OG చిత్రాలు త‌మిళంలోను భారీగా రిలీజ్ కావాల్సి ఉన్న సంగ‌తి తెలిసిందే.

అస‌లు గొడ‌వేంటి?

గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతి లడ్డూలలో జంతువుల కొవ్వును ఉపయోగించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనతో సెప్టెంబర్ 18 న పెద్ద దుమారం చెలరేగింది. ప్రతిగా వైకాపా నాయ‌కులు,.. చంద్ర‌బాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం హీనమైన ఆరోపణలకు పాల్పడుతున్నారని ప్ర‌త్యారోప‌ణ‌లు చేస్తున్నారు.

లడ్డూల తయారీకి బీఫ్ ఫ్యాట్, చేప నూనె, పందికొవ్వు వాడినట్లు ల్యాబ్ రిపోర్టులు స్పష్టంగా చెబుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ అన్నారు. దీనిపై ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా పలువురు మీడియా స‌మావేశాల్లో మాట్లాడుతున్న విష‌యాలు హైలైట్ గా మారుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో కార్తీ ఈ గొడ‌వ‌లో త‌ల‌దూర్చాడు.

Tags:    

Similar News