పవన్ కల్యాణ్ స్మగ్లింగ్ కామెంట్స్ అల్లు అర్జున్ ను ఉద్దేశించేనా?

వన్య ప్రాణి, అటవీ సంరక్షణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అప్పట్లో హీరోలు అడవులను కాపాడితే, ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్నారని అన్నారు.

Update: 2024-08-08 12:20 GMT

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏనుగుల సమస్యపై కర్ణాటక ప్రభుత్వంతో చర్చించడానికి గురువారం బెంగుళూరు వెళ్ళిన సంగతి తెలిసిందే. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలను ఇబ్బందులు పెడుతున్న ఏనుగుల్ని నియంత్రించేందుకు అవసరమైన కుంకీ ఏనుగులను అందించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని పవన్ కోరారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరోల పాత్రలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

వన్య ప్రాణి, అటవీ సంరక్షణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అప్పట్లో హీరోలు అడవులను కాపాడితే, ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్నారని అన్నారు. "40 సంవత్సరాల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడే వాడు. కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇది ప్రస్తుతం సినిమా పరిస్థితి. నేను కూడా సినిమా రంగంలో భాగమైనప్పటికీ, ఇలాంటి చిత్రాల్లో నటించడానికి నేను ఇబ్బంది పడతాను. ఒక మంచి సందేశం ఇవ్వాలనే ఎక్కువ శాతం అలాంటి పాత్రలు చేయకుండా ఉన్నాను. ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ మంచి చేయాలని కోరుకుంటున్నాను" అని పవన్ తెలిపారు.

అడవులను రక్షించడానికి, స్మగ్లింగ్ కార్యకలాపాలను అరికట్టడానికి వాటికి వ్యతిరేకంగా కన్నడ లెజెండరీ నటుడు రాజ్ కుమార్ 'గంధడ గుడి' సినిమా తీశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇప్పుడు మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తోందన్నారు. అయితే సినిమాల్లో హీరోలు అడవులు నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని పవన్ అనడంతో.. ఈ కామెంట్స్ పరోక్షంగా అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాను ఉద్దేశించే అన్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చలు మొదలు పెట్టారు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప: ది రైజ్' సినిమాలో అల్లు అర్జున్ ఒక స్మగ్లర్ గా కనిపించిన సంగతి తెలిసిందే. శేషాచలం అడవుల్లో కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్.. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేదే ఈ మూవీ స్టోరీ. దానికి కొనసాగింపుగా ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' చిత్రం రూపొందుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ కామెంట్లను పుష్ప నేపథ్యానికి లింక్ చేస్తూ నెటిజన్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి కాకుండా వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. తమ ఫ్యామిలీలోని పవన్ కళ్యాణ్ పార్టీకి మద్దతు ప్రకటించకుండా, స్నేహితుడని చెప్పి నంద్యాల వెళ్లి మరీ ప్రత్యర్థికి అండగా నిలవడంపై మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత బన్నీ శుభాకాంక్షలు చెప్పినప్పటికీ వారు శాంతించలేదు. ఇప్పుడిప్పుడే అంతా నార్మల్ అవుతుందని అనుకుంటుండగా.. లేటెస్టుగా పవన్ ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం పవన్ జనరల్ గా చెప్పారని, దాంట్లో తప్పు పట్టాల్సింది ఏమీ లేదని అంటున్నారు.

Tags:    

Similar News