ప్రభాస్ కోసం నేతాజీని తీసుకొస్తారా?
ఇంకా అధికారికంగా ప్రకటించబడిన ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ మూవీ తరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హను.. ఈసారి డార్లింగ్ తో ఒక హిస్టారికల్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు. ఇది యుద్ధ నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామా. ఇందులో అందమైన ప్రేమకథను మిళితం చేశారని టాక్. ఇంకా అధికారికంగా ప్రకటించబడిన ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రభాస్, హను రాఘవపూడిల చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ ను అనుకుంటున్నారని మనం ఇది వరకే చెప్పుకున్నాం. ఈ సినిమాలో భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు జరిగే కథని చెప్పబోతున్నారు. ఇందులో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తారనే ప్రచారం సాగుతోంది. అతనొక బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తాడనే మాట కూడా వినిపిస్తోంది. అంతేకాదు దీంట్లో భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా భాగం అవుతారని టాక్ నడుస్తోంది.
భారతీయులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అహింసావాదంతో కాదు, సాయుధ పోరాటం ద్వారానే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, ఆచరణలో పెట్టిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఇండియాకి స్వాతంత్ర్యం తీసుకురావాలనే లక్ష్యంతో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 'ఆజాద్ హిందు ఫౌజ్' ను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఈ అంశాలను ప్రస్తావిస్తున్నారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది.
ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం ఉంది. దీనికి తగ్గట్టుగానే ఈ మూవీలో ఆజాద్ హిందు ఫౌజ్ సభ్యుడిగా ప్రభాస్ కనిపిస్తారని, అందుకే 'ఫౌజీ' అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. నేతాజీ పాత్రను కూడా క్రియేట్ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, ఈ వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతేడాది స్పై, డెవిల్ వంటి చిత్రాలలో సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన అంశాలను జోడించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే హను రాఘవపూడి సినిమాలో ప్రభాస్ కు జోడీగా సీతారామం ఫేమ్ మృణాళ్ ఠాకూర్ ను హీరోయిన్ గా తీసుకున్నారని, పాకిస్తానీ నటి సజల్ అలీని ఎంపిక చేశారని రోజుకో వార్త వినిపిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలను సిద్ధం చేసినట్లుగా హను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ కోసం ప్రత్యేకంగా సెట్స్ నిర్మిస్తున్నారు. ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబరు నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.